
- కాటగల్పిన గూగుల్ మ్యాప్స్
- రూట్తప్పుగా చూపడంతో.. గౌరవెల్లి రిజర్వాయర్లోకి డీసీఎం
- నీటి మధ్యలో ఉన్న నలుగురు వ్యక్తులను కాపాడిన స్థానికులు
సిద్దిపేట, వెలుగు : రాత్రివేళ గూగుల్ మ్యాప్ ను నమ్ముకొని ముందుకు వెళ్తున్న ఓ డీసీఎం ఏకంగా రిజర్వాయర్లోకి వెళ్లింది. డీసీఎంలో నీటి లోపలికి ప్రమాదం అంచు వరకు వెళ్లిన నలుగురిని స్థానికులు కాపాడారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. హన్మకొండ నుంచి మిల్క్ ప్యాకెట్ల లోడ్ తో హుస్నాబాద్ కు చేరుకున్న డీసీఎం వాహనం స్థానికంగా కొన్ని ప్యాకెట్లను డెలివరీ చేసింది. రాత్రి10 గంటల ప్రాంతంలో హుస్నాబాద్ నుంచి చేర్యాల మీదుగా హైదరాబాద్కు వెళ్లేందుకు గుగుల్ డెస్టినేషన్ మ్యాప్ చూసుకుంటూ బయలుదేరింది.
సరిగ్గా నందారం స్టేజి వద్ద కుడివైపుగా చూపించాల్సిన మ్యాప్ ఎడమవైపు చూపడంతో డీసీఎం నేరుగా గౌరవెల్లి ప్రాజెక్టు నీటిలోకి వెళ్లిపోయింది. మొదట రోడ్డుపై వర్షపు నీళ్లు ఆగాయని భావించిన డ్రైవర్అలాగే ముందుకు వెళ్లడంతో.. నీళ్లు పెరిగి వాహనం మునుగుతూ వచ్చింది. తాము దారి తప్పామని గ్రహించి వాహనాన్ని నిలిపివేశారు. అందులో డ్రైవర్, క్లీనర్ తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.
బండి లైట్లు ఆగిపోయాయి. చిమ్మ చీకటి చుట్టంతా నీళ్లు ఉండటంతో ఎటు వెళ్లాలో తెలియని స్థితిలో ఆ నలుగురు బిగ్గరగా అరిచారు. దాదాపు రెండు గంటల తర్వాత వారి అరుపులు విన్న స్థానికులు..సెల్ ఫోన్ లైట్లతో అక్కడికి చేరుకొని.. నలుగురు వ్యక్తులను బయటకు తీసుకువచ్చారు. మరికొంత ముందుకు డీసీఎం వెళ్లి ఉంటే వాహనం పూర్తిగా మునిగి, నలుగురు ప్రాణాలు కోల్పోయేవారు. తెల్లవారిన తర్వాత జేసీబీ సాయంతో డీసీఎంను బయటకు తీశారు.
4 నెలల క్రితం మొదటిసారి
ఆండ్రాయిడ్ ఫోన్ లో గుగూల్ మ్యాప్ ఆధారంగా చేర్యాల నుంచి హుస్నాబాద్ వస్తున్న ఓ లారీ 4 నెలల కింద కూడా ఇలాగే నేరుగా గౌరవెల్లి ప్రాజెక్టులోకి వెళ్లింది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ లారీ గత సెప్టెంబర్ 6వ తేదీన రాత్రి హైదరాబాద్ నుంచి చేర్యాల మీదుగా హుస్నాబాద్ కు వెళ్తోంది. లారీ డ్రైవర్ శివ, క్లీనర్ మొండయ్యలు చేర్యాల దాటిన తర్వాత గూగూల్ మ్యాప్ చూపిన గుడాటిపల్లి మీదుగా హుస్నాబాద్ వెళ్లడానికి లారీతో ముందుకు సాగారు. గుడాటిపల్లికి కొంత దూరం ముందే రోడ్డుపై నీళ్లు చేరడంతో వారు వర్షం నీరుగా బావించి లారీని ముందుకు తీసుకవెళ్లగా.. లారీ ప్రాజెక్టులోకి వెళ్లి క్యాబిన్ వరకు నీళ్లు వచ్చి ఇంజన్ ఆగిపోయింది. చేర్యాల మీదుగా హుస్నాబాద్ కు వెళ్లే మార్గంలో గౌరవెల్లి ప్రాజక్టు నిర్మిస్తున్నారు. ఈ మార్గంలో పలు ప్రాంతాలు రోడ్లు ముంపునకు గురయ్యాయి. ఈ విషయాన్ని గుగుల్ మ్యాప్ లో అప్ డేట్ కాకపోవడంతో డిస్టినేషన్తప్పుగా చూపుతున్నది.