దిగుబడి దండిగా.. కొనుగోలు కొద్దిగా!

ఆందోళనలో నిజామాబాద్​ జిల్లా శనగ రైతులు 
ఎకరాకు 6 క్వింటాళ్లే  కొనుగోలు..
జిల్లాలో లక్షా 20 వేల  క్వింటాళ్ల దిగుబడి 
70 వేల క్వింటాళ్ల కొనుగోలుకు పర్మిషన్​
కౌలు నామా ఎత్తివేతతో   రైతుల పరేషాన్ 

కోటగిరి, వెలుగు : రైతులు పండించిన పంటలన్నీ పూర్తిగా కొంటామని, ఎవరూ రంది పడొద్దని  ప్రభుత్వ పెద్దలు చెబుతున్నప్పటికీ అమలు కావడం లేదు. దీంతో ఆరుగాలం కష్టపడి రైతులు ఎంత ఎక్కువ దిగుబడి తీసినా.. వారి ముఖాల్లో సంతోషం ఉండడం లేదు. అమ్మే టైంలో ప్రభుత్వం పెట్టే కొర్రీలతో  తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం నిజామాబాద్​ జిల్లా శనగ రైతులు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. 

​జిల్లాలో 21 వేల ఎకరాల్లో సాగు..

ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా శనగ కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి.  జిల్లాలో కోటగిరి, పొతంగల్, బోధన్, రేంజల్, నందిపేట, నిజామాబాద్​రూరల్ తదితర మండలాల్లో రైతులు  సుమారు 21,360  ఎకరాల్లో శనగ పంటను సాగు చేశారు.  ఎకరానికి 8 నుంచి 9 క్వింటాళ్ల చొప్పున, సుమారు లక్షా 20 వేల క్వింటాళ్ల శనగ దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వం శనగలు క్వింటాల్​కు రూ. 5, 335 మద్దతు ధరకు పంటను కొనుగోలు చేస్తామని ప్రకటించింది. కానీ ఎకరానికి 6 క్వింటాళ్లే.. 5 ఎకరాల వరకే కొనుగోలు కేంద్రాలకు తేవాలని  కండీషన్​పెట్టింది.

12 కేంద్రాలు.. 70 వేల క్వింటాళ్లు..

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం  మార్క్​ఫెడ్​ద్వారా 12 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి శనగలను కొనుగోలు చేస్తోంది.  70 వేల క్వింటాళ్ల కొనుగోలు వరకే తమకు  ప్రభుత్వం నుంచి పర్మిషన్లు వచ్చాయని  అధికారులు చెబుతున్నారు.  ఈ లెక్కన   ఇంకా 50 వేల క్వింటాళ్ల శనగలు మిగులుతున్నాయి. అవి ఎవరికి అమ్ముకోవాలని రైతులు వాపోతున్నారు. బహిరంగ మార్కెట్​లో  క్వింటాల్​కు రూ. 800 నుంచి 1,000  వరకు పలుకుతుండడంతో తీవ్రంగా నష్టపోతామని  చెప్తున్నారు.  రవాణా చార్జీల భారంతో తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు 6 క్వింటాళ్ల నిబంధన ఎత్తివేసి పండిన పంటనంతా ప్రభుత్వమే కొనాలని డిమాండ్ ​చేస్తున్నారు. 

కౌలు రైతుల కష్టాలు..

గతంలో మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన పంట పైసలు కౌలు నామా ద్వారా కౌలు రైతుల అకౌంట్​లో వేసేవారు. కానీ ప్రస్తుతం పట్టాదారుల  అకౌంట్​లోనే శనగ పంట డబ్బులు పడతాయని,  పట్టేదారుల అకౌంట్ వివరాలు మాత్రమే ఇవ్వాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చెప్పడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ముందే  కౌలు పైసలు మొత్తం చెల్లించి పొలం తీసుకున్నామని, కానీ ఇప్పుడు పంట పైసలు పట్టాదారుల అకౌంట్లో పడితే వారు పైసలిచ్చేందుకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని వాపోతున్నారు.  చాలా మంది పట్టాదారులు అకౌంట్​నంబర్లు ఇవ్వడం లేదని  చెప్తున్నారు.  కౌలు రైతుల అకౌంట్లో పడేలా వెంటనే కొనుగోలు నిబంధనలు సడలించాలని కోరుతున్నారు. 

పండిన పంట మొత్తం కొనాలి 

ఎకరాకు 6 క్వింటాళ్లే కొంటామని చెబుతున్నారు. నాకున్న రెండెకరాల్లో శనగ పంటను వేశాను. ఎకరానికి 9 క్వింటాళ్ల కాడికి పండింది. రెండెకరాల్లో 18 క్వింటాళ్లు పండింది. 12 క్వింటాళ్లు  మాత్రమే కొన్నారు. మిగతాది ఎక్కడ అమ్ముకోవాలో తెలియడం లేదు. ఎలాంటి షరతులు లేకుండా పండిన పంటను మొత్తం ప్రభుత్వమే  కొనాలి.
– పండరి నాథ్, శనగ రైతు, కొల్లూర్

పట్టాదారులు అకౌంట్ వివరాలు ఇస్తలే.. 

నేను 25 ఎకరాలు కౌలు చేస్తాను. 8 ఎకరాల్లో శనగ పంట వేశాను.  పంట దిగుబడి బాగానే ఉంది.  పంట డబ్బులు పట్టేదారు అకౌంట్​లో  పడితే ఇబ్బందులు వస్తాయి. అయినా వారు అకౌంట్​వివరాలు ఇస్తలేరు.  రూల్స్​మార్చి కౌలు రైతుల అకౌంట్​లోనే పైసలు వేయాలి.  

- నగేశ్​,  కౌలు రైతు ,హెగ్డోలి

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం 

ప్రభుత్వ నిబంధనల ప్రకారమే  కొనుగోళ్లు చేస్తున్నాం. ఎకరానికి 6 క్వింటాళ్ల నిబంధన, కౌలు రైతుల అకౌంట్​లో కాకుండా పట్టేదారుల అకౌంట్లో డబ్బులు పడడంపై రైతుల నుంచి కంప్లైంట్లు  వస్తున్నాయి. రైతులకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.  

– రంజిత్ కుమార్ రెడ్డి, మార్క్​ఫెడ్​ డీఎం