ఎమ్మెల్యే నరేందర్‌ను బట్టలిప్పి చౌటుప్పల్‌లో నిలబెడ్తం
నేతన్నల మగ్గాన్నే తన్నుతడా?
మునుగోడును దత్తత తీసుకోకుండా ఎనిమిదిన్నరేండ్లు ఏంచేశారని కేటీఆర్‌పై ఫైర్
సంస్థాన్ నారాయణపురం, వెలుగు : తానీషాలుగా మారి చక్రవర్తులు అవుతారో.. అన్ని భరిస్తూ బానిసలుగా బతుకుతారో ప్రజలే నిర్ణయించుకోవాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. టీఆర్ఎస్ లీడర్లు మోసగాళ్లు, ఘరానా దొంగలని విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయని టీఆర్ఎస్.. సిగ్గు లేకుండా ఓట్లు అడుగుతున్నదని మండిపడ్డారు. శనివారం సంస్థాన్ నారాయణపురంలో ‘బహుజనుల ఆత్మగౌరవ సభ’ నిర్వహించారు. ఈ సందర్భంగా శివాలయం నుంచి సభా వేదిక దాకా భారీ ర్యాలీ నిర్వహించారు. తర్వాత సభలో ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. ‘‘మునుగోడును దత్తత తీసుకుంటానని కేటీఆర్ అంటున్నడు. ఎనిమిదిన్నరేండ్లు అధికారంలో ఉండి గడ్డి పీకినవా? మర్రిగూడలోని భూ నిర్వాసితులను హరీశ్‌రావు ఆదుకుంటానంటున్నడు. నీ మామతో మర్రిగూడ వచ్చి ఇంటికి రెండు ఉద్యోగాలిస్తానన్న హామీ ఏమైంది..?”అని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.
ఎగిరేది నీలి రంగు జెండానే..
మునుగోడు గడ్డపై ఎగిరేది నీలి రంగు జెండానేనని ప్రవీణ్ కుమార్ అన్నారు. ‘‘బీఎస్పీ ర్యాలీ చూసి బీజేపోళ్లు పారిపోయిన్రు. జేపీ నడ్డా సభను వాయిదా వేసుకున్నరు. మన సభ టైంలో వైన్ షాపుల వద్ద ఎవరూ లేరు. ఆదివారం మాత్రం క్యూ కడ్తరు. ఎందుకంటే మన కోతల రాయుడు కేసీఆర్ సభ చండూరులో ఉన్నది. అందుకే టీఆర్ఎస్సోళ్లంతా వైన్ షాపుల దగ్గరే ఉంటరు”అని విమర్శించారు. ‘‘నేతన్నల మగ్గాన్ని ఎమ్మెల్యే నరేందర్ కాలుతో తన్నుతున్నడు. ఆడి బట్టలిప్పి చౌటుప్పల్‌లో నిలబెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి”అని హెచ్చరించారు. -బీసీ బిడ్డ శంకరచారిని గెలిపించాలని కోరారు.
ఓట్లు మావే.. సీట్లు మావే..
‘‘బీఎస్పీ వచ్చి మా ఓట్లు చీల్చుతున్నదని టీఆర్ఎస్ అంటున్నది. ఇక్కడి ఓట్లు మావే.. సీట్లు మావే.. అట్టల మీద గొల్ల కుర్మలకు అన్నం పెట్టి వారి ఆత్మ గౌరవాన్ని కించపర్చిన్రు. అలాంటి టీఆర్ఎస్కు గుణపాఠం చెప్పాలి”అని ప్రవీణ్‌కుమార్ అన్నారు. కారు డొక్కు అయ్యిందని, 20 ఏండ్ల కారును ఎవరైనా నడిపిస్తారా? అని టీఆర్ఎస్ను ఉద్దేశిస్తూ ఎద్దేవా చేశారు. ఇక కారును యార్డ్‌కు పంపాల్సిందే అని సెటైర్లు వేశారు. కమ్యూనిస్టులు దొరలకు మద్దతు ధరకు అమ్ముడుపోయారని ఎద్దేవా చేశారు. అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కును మందు, చికెన్, డబ్బులకు అమ్ముకోవద్దని రాజ్యసభ సభ్యులు రాంజీ గౌతమ్ సూచించారు.