న్యూఢిల్లీ: షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో) 21వ మీటింగ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. దుషన్బేలో జరిగిన ఈ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ పాల్గొన్నారు. ఇప్పుడు తీవ్రవాదం అతిపెద్ద సవాల్‌గా మారిందని మోడీ అన్నారు. శాంతియుత పరిస్థితులు నెలకొల్పేందుకు అందరమూ కృషి చేయాల్సి ఉంటుందని ఎస్‌సీవో సభ్య దేశాలకు పిలుపునిచ్చారు.
‘ఎస్‌సీవో భవిష్యత్ గురించి ఆలోచించడానికి ఇదే సరైన సమయం. ఈ ప్రాంతంలో శాంతి భద్రతలు, పరస్పర నమ్మకాన్ని నెలకొల్పే విషయంలో ఎదురవుతున్న పెద్ద సమస్యగా తీవ్రవాదాన్ని చెప్పాలి. రీసెంట్‌గా అఫ్గానిస్థాన్‌లో జరుగుతున్న పరిణామాలు దీన్ని బలపరుస్తున్నాయి. ఎస్‌సీవోలో కొత్తగా చేరుతున్న ఇరాన్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఖతర్‌కు స్వాగతం’ అని మోడీ పేర్కొన్నారు.