హైదరాబాద్, వెలుగు: గ్రేటర్లో ఎండలు దంచి కొడుతుండడంతో తాగునీటికి డిమాండ్ పెరిగింది. నల్లాల ద్వారా సరిపడా నీళ్లు రాని కాలనీల వాసులు ట్యాంకర్ల మీదనే ఆధారపడుతున్నారు. ఈ క్రమంలో వచ్చే వారం నుంచి 24 గంటలూ ట్యాంకర్లు సరఫరా చేయాలని వాటర్‌బోర్డు నిర్ణయించింది. గురువారం ఖైరతాబాద్ లోని హెడ్డాఫీసులో వేసవి కార్యాచరణ, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాపై పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్వాటర్బోర్డు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాదితో పోలిస్తే ఈసారి ట్యాంకర్ల డిమాండ్ 50 శాతం పెరిగిందన్నారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. డిమాండును బట్టి రోజుకు 9 వేల ట్యాంకర్లు సరఫరా చేసేలా యాక్షన్ ప్లాన్ రూపొందించినట్లు వివరించారు. కమర్షియల్ అవసరాలకు నీరు అందించేందుకు ప్రత్యేకంగా నైట్ షిఫ్ట్ ఏర్పాటు చేశామన్నారు. ఇక నుంచి ప్రతి ఫిల్లింగ్ స్టేషన్ నుంచి 300 అదనపు ట్రిప్పులు సరఫరా చేస్తామన్నారు. ఇందుకోసం 250 కొత్త ట్యాంకర్లు ఏర్పాటు చేస్తున్నామని, జీహెచ్ఎంసీ, ఇతర మార్గాల నుంచి 250 మంది డ్రైవర్లను సమకూర్చుకుంటామని వెల్లడించారు.
బుక్‌చేసిన 24 గంటల్లో డెలివరీ
ఏప్రిల్ మొదటి వారం నాటికి గ్రేటర్‌పరిధిలో అదనపు వాటర్ఫిల్లింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు దానకిశోర్తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో 6, ఓఆర్ఆర్ పరిధిలో భవిష్యత్తు అవసరాల కోసం డివిజన్ కు రెండు చొప్పున ఏడు డివిజన్లలో 14 కొత్త ఫిల్లింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. డిమాండుకు అనుగుణంగా అవసరమైతే మరిన్ని ట్యాంకర్లు కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తామన్నారు.
ట్యాంకర్ బుక్ చేసిన 24 గంటల్లో నీరు సరఫరా చేయాలని దానకిశోర్అధికారులను ఆదేశించారు. ఒకవేళ ఆలస్యమైతే. ఎస్ఎంఎస్ ద్వారా సమచారం అందించాలని సూచించారు. సమీక్షలో వాటర్‌బోర్డు ఎండీ సుదర్శన్ రెడ్డి, ఈడీ డా.ఎం.సత్యనారాయణ, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, టెక్నికల్ డైరెక్టర్ రవికుమార్, డైరెక్టర్ ఆపరేషన్స్-2 స్వామి, సీజీఎంలు, జీఎంలు ఇతర అధికారులు పాల్గొన్నారు.