అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు!

అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు!
  •     కండువాలు మారుస్తున్న నేతలు, కార్యకర్తలు
  •     టికెట్​ ఆశించి భంగపడ్డవారు సైతం
  •     జిల్లాలో అన్ని పార్టీల్లోకి వలసలు

కామారెడ్డి, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయా పార్టీల్లోకి వలసలు అధికమవుతున్నాయి. జిల్లాలో అన్ని పార్టీల నేతలు, లీడర్లు, కార్యకర్తలు కండువాలు మారుస్తున్నాయి. ఎమ్మెల్యే టికెట్లు ఆశించి భంగపడ్డ వారు, ప్రస్తుతమున్న పార్టీపై వ్యతిరేకత, గుర్తింపు లేకపోవడం, స్థానిక లీడర్ల మధ్య సఖ్యత లేకపోవడం తదితర కారణాలతో సొంత పార్టీని వీడి ఇతర పార్టీల వైపు పరుగులు పెడుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో  కింది స్థాయి కార్యకర్తలే కాకుండా మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి నేతలు పార్టీలు మారుతుండడం చర్చనీయాంశమవుతోంది. ముఖ్యంగా కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో చేరికలు ఎక్కువగా ఉన్నాయి.  

కామారెడ్డి సెగ్మెంట్​లో .. 

సీఎం కేసీఆర్​ పోటీ చేస్తున్న కామారెడ్డి సెగ్మెంట్​లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ​చేరికలను ప్రోత్సహిస్తున్నాయి. బీఆర్ఎస్​కు చెందిన మున్సిపల్ ​వైస్​చైర్​పర్సన్​ ఇందుప్రియ, ఈమె భర్త చంద్రశేఖర్​రెడ్డి, మరో కౌన్సిలర్​ వంశీ, రేవంత్​రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్​అలీ సమక్షంలో కాంగ్రెస్​కండువా కప్పుకున్నారు.

బీజేపీకి చెందిన కౌన్సిలర్​రాజు, మరో నేత ఎంజీ వేణుగోపాల్​గౌడ్​ కేటీఆర్​ సమక్షంలో గులాబీ గూటికి చేరగా, కాంగ్రెస్​కు చెందిన పలువురు కార్యకర్తలు బీఆర్ఎస్​లో తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీలోకి కూడా వలసలు పెరిగాయి. నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన ఆయా పార్టీల కార్యకర్తలు ఆ పార్టీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి సమక్షంలో కాషాయ కండువాలు ధరిస్తున్నారు.

ఎల్లారెడ్డిలో ఇంట్రెస్టింగ్..​

ఈ సెగ్మెంట్​లో వివిధ పార్టీలకు చెందిన బడా నేతలు మారడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్​రెడ్డి బీజేపీని వీడి కాంగ్రెస్​ గూటికి చేరారు. బీజేపీ తరఫున ఎనుగు ఎమ్మెల్యే బరిలో నిలుస్తారని అంతా భావించగా, ఆయన చివరి క్షణంలో పార్టీ ఛేంజ్​ చేశారు. ఈయన బాన్సువాడ నుంచి బరిలో నిలుస్తారని ప్రచారం జరుగుతోంది. ఎల్లారెడ్డి కాంగ్రెస్ ​నుంచి టికెట్​ఆశించి భంగపడ్డ పీసీసీ జనరల్​సెక్రెటరీ వడ్డేపల్లి సుభాష్​రెడ్డి, ఈయన అనుచరులు కాంగ్రెస్​కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు.

సుభాష్​రెడ్డికి బీజేపీ టికెట్​ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్​పార్టీ అభ్యర్థి మదన్​మోహన్​రావు నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో తిరుగుతూ చేరికలపై దృష్టి పెట్టారు. పలువురు సర్పంచులు బీఆర్ఎస్​నుంచి కాంగ్రెస్​లో చేరారు. కాంగ్రెస్​ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే జనార్ధన్​గౌడ్​ఇటీవల కేటీఆర్​ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పలువురు ఎమ్మెల్యే జాజాల సురేందర్​ సమక్షంలో బీఆర్ఎస్​లో చేరుతున్నారు. 

ALSO READ : నల్గొండ బీజేపీలో తేలిన నాలుగు సీట్లు