జాతి మరువని మహానేత అటల్ బిహారి వాజ్ పేయి

జాతి మరువని మహానేత అటల్ బిహారి వాజ్ పేయి
అభివృద్ధి రాజకీయాలకు మరో పేరు అటల్ బిహారి వాజ్ పేయి. రాజకీయాల్లో సిద్ధాంతాలు, విలువల ప్రాధాన్యతను పెంచేందుకు ఎంతో కృషి చేశారు. పార్లమెంటు లోపలా, బయటా ఆయన హుందా ప్రవర్తన రాజకీయాల గౌరవాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల విశ్వాసాన్ని పెంచింది. ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. సంకీర్ణ రాజకీయాలకు శ్రీకారం చుట్టి కూటమి ప్రభుత్వాలను ఎలా నడపాలో తెలియజేసిన వ్యక్తి. మూడు సార్లు ప్రధాని పదవి చేపట్టినా వీసమెత్తు గర్వం కనిపించదు. పదవిని అలంకారంగా మార్చుకుని ప్రజల మన్నన పొందిన మహానేత వాజ్​పేయి. మన దేశంపై వివిధ రంగాల్లో చెరగని ముద్ర వేసిన మహానేత వాజ్​పేయి. అణు  పరీక్షలు చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచినా, బస్సులో దాయాది దేశానికి వెళ్లి స్నేహహస్తం చాచినా ఆయనకే చెల్లింది. పొరుగు దేశాలతో సత్సంబంధాలు కోరుకున్న వాజ్​పేయి.. అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకోగలమని కార్గిల్ యుద్ధంతో భారత్ సత్తాను ప్రపంచానికి చాటారు. ఇవేకాక ఎన్నో సాహసోపేత నిర్ణయాలతో దేశాన్ని అభివృద్ధి బాట పట్టించారు.. అయోధ్య వివాదానికి న్యాయ ప్రక్రియ ద్వారా లేదా పరస్పర ఆమోదయోగ్యమైన చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలన్న ఆయన నిర్దేశం జాతి సమగ్రతకు గొడుగు పట్టింది. రాజకీయ, సామాజిక, ఆర్థిక విధానాల విషయంలో అటల్​జీకి లోతైన అవగాహన ఉంది. ఆర్థిక సంస్కరణల అమల్లో కూడా ప్రజల విస్తృత ప్రయోజనాలకు పెద్దపీట వేశారు. ప్రజాస్వామ్యం కోసం పోరాటం 1975లో ఇందిరాగాంధీ ఎమెర్జెన్సీని ప్రకటించడంతో ప్రజాస్వామ్యం కకావికలమైంది. నాయకులంతా మీసా చట్టం కింద జైలు పాలయ్యారు. దీనికి వ్యతిరేకంగా పోరాడిన వాజ్ పేయి దీర్ఘకాలం పాటు జైలు శిక్ష అనుభవించారు. ప్రజాస్వామ్యం ప్రమాదాన్ని ఎదుర్కొన్నప్పుడు దాన్ని కాపాడేందుకు ఆయన అవిశ్రాంతంగా పోరాడారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడటానికి సంఘ సంస్కర్త జయప్రకాశ్ నారాయణ్ పిలుపు మేరకు జనసంఘ్ ను 1977లో జనతా పార్టీలో విలీనం చేశారు. 1977 ఎన్నికల్లో జనతా పార్టీ విజయం తర్వాత మొరార్జీ దేశాయ్ కేబినెట్​లో విదేశాంగ మంత్రిగా వాజ్ పేయి యునైటెడ్​ నేషన్స్​ జనరల్​ అసెంబ్లీ సమావేశంలో హిందీలో ప్రసంగించి ప్రతి భారతీయునిలో ఆత్మగౌరవాన్ని నింపారు. 1998, 2000, 2001, 2002, 2003ల్లోనూ యూఎన్​లో ప్రధాని హోదాలో ప్రసంగాలు చేసి ప్రపంచాన్ని ఆకట్టుకున్నారు. అటల్​జీ ప్రసంగాలు కవితా పంక్తులతో, ఛలోక్తులతో శత్రువులను సైతం ఆకట్టుకునేవి. జనసంఘ్ వేదికలపై, 1959లో టిబెట్ పై పార్లమెంట్ లో, పోక్రాన్​ అణు పరీక్షలప్పుడు ఆయన చేసిన ప్రసంగాలు ఎంతో ఆకట్టుకున్నాయి. లడక్ లో చైనా దురాక్రమణ బయటపడ్డప్పుడు, 19 మార్చిలో దలైలామా శరణార్థిగా వచ్చినప్పుడు అటల్జీ ఉపన్యాసాలు లోక్ సభను కుదిపేశాయి. నిజాయితీగా రాజకీయాలు చిరకాల మిత్రులైన ఎల్.కె. అద్వానీ, బైరాంసింగ్ షెకావత్ తోపాటు​జనసంఘ్, ఆర్​ఎస్​ఎస్​ నుంచి వచ్చిన సహచరులను కలుపుకుని 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీని స్థాపించారు. 1980 నుంచి 1986 వరకు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు. నిర్విరామ శ్రమతో ఒక్కో ఇటుక పేర్చి పార్టీని నిర్మించారు. దీని ఫలితంగా బీజేపీ అనేక రాష్ట్రాల్లో బలమైన శక్తిగా అవతరించింది. జనతా ప్రభుత్వం తర్వాత వచ్చిన ఇందిరా కాంగ్రెస్ ప్రభుత్వానికి కొరుకుడుపడని విమర్శకునిగా మారారు. 1995లో ముంబైలో జరిగిన సమావేశంలో అప్పటి బీజేపీ అధ్యక్షుడు అద్వానీ.. వాజ్ పేయిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించారు. 1996లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాలు గెలిచింది. వాజ్ పేయి దేశ 10వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినా అది 13రోజులకే పరిమితమైంది. ‘‘అధికారంలో కొనసాగడానికి అవినీతిని ఆశ్రయించం.. మా ఆత్మల్ని అమ్ముకోవాలనో, తాకట్టు పెట్టాలనో మేము అనుకోవడం లేదు’’అంటూ ప్రధానిగా పార్లమెంట్ లో చేసిన చరిత్రాత్మక ప్రసంగం వాజ్​పేయి నైతికతకు ప్రతీకగా నిలిచింది. 1998 ఎన్నికల్లో అటల్​జీ నిజాయితీ గుర్తించిన ప్రజలు చారిత్రక విజయాన్ని అందించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. నేషనల్ డెమోక్రటిక్​ అలయన్స్ గా ఏర్పడి రెండో సారి ప్రధానిగా అటల్​జీ 13 నెలల పాటు ప్రభుత్వాన్ని నడిపించారు. పొరుగు దేశాలతో సత్సంబంధాలు ప్రధానిగా సరిహద్దు దేశాలతో స్నేహ సంబంధాలను పెంపొందించేందుకు వాజ్​పేయి ఎంతో కృషి చేశారు. చైనాతో సరిహద్దు వివాదాల పరిష్కారానికి పాటుపడ్డారు. లుక్ ఈస్ట్ విధానంలో భాగంగా ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా దేశాలతో సంబంధాలు బలపడేలా చేశారు. మిత్ర దేశం రష్యాతో, అమెరికా, చైనాలతో సత్సంబంధాలు పెంపొందించారు. కార్గిల్ యుద్ధానికంటే ముందు పాకిస్తాన్‌‌తో శాంతి కోసం అనేక విధాలుగా దౌత్య ప్రయత్నాలు చేశారు. 1999లో ఢిల్లీ––లాహోర్​ మధ్య బస్సు దౌత్యానికి శ్రీకారం చుట్టి అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను కలుసుకునేందుకు ఆ బస్సులోనే ప్రయాణించారు. కాశ్మీర్ సమస్య పరిష్కరించడానికి వీలుగా శాంతి ఒప్పందం కోసం అహర్నిశలు పాటుపడ్డారు. కార్గిల్ యుద్ధ పరిణామాల తర్వాత 1999లో 13వ లోకసభ ఎన్నికల తర్వాత ఎన్డీఏ కూటమి పార్లమెంట్‌‌లో స్థిరమైన మెజారిటీ పొంది మరోసారి అటల్​జీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి 2004 వరకు నిరాటంకంగా పాలించారు. ఆ తర్వాత ఎన్‌డీఏ చైర్మన్‌‌గా కొనసాగారు. 2005లో రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. 2018 ఆగస్టు 16న తన 93వ ఏట కన్నుమూసిన అటల్​జీ ప్రతి భారతీయుడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. మొత్తంగా 47 ఏండ్ల పాటు పార్లమెంట్ సభ్యుడిగా సేవలందించి.. 1994లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు తీసుకున్నారు. ఆయన దేశానికి చేసిన విశేష సేవలకు గుర్తుగా 2014 డిసెంబర్ 24న కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. అటల్​జీ పుట్టినరోజు అయిన డిసెంబర్ 25ను కేంద్ర ప్రభుత్వం ‘‘సుపరిపాలనా దినం”ప్రకటించింది. ఆయన పరిపాలన, రాజకీయ అనుభవాలు వాజ్ పేయి శకంగా దేశచరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న ధీశాలి సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో రాజకీయ అస్పృశ్యత మొదలుకుని తీవ్రమైన వనరుల కొరత వరకు సవాళ్లెన్ని ఎదురైనా అటల్​జీ సంయమనం కోల్పోలేదు. వాటిని విజయవంతంగా అధిగమించడమే కాకుండా బీజేపీకి విశిష్ట గుర్తింపును తీసుకువచ్చారు. పార్టీ వ్యవస్థాపక బాధ్యతల్లో వాజ్​పేయి నిర్వహించనిది ఏదీ లేదు. కొత్త సభ్యులను చేర్చుకోవడానికి, కార్యకర్తలను కలవడానికి, పార్టీ ఆలోచనలు, విధానాలు, సిద్ధాంతాలను ప్రజలకు చేరవేయడానికి ఎంతో దూరం సైకిల్ పై వెళ్లడం మొదలుకుని పార్టీ నిధుల సమీకరణకు దేశవ్యాప్తంగా తిరగడం వరకు ఆయన నిబద్ధతతో చేశారు. అటు మేధస్సుతో కూడిన బాధ్యతలను, ఇటు సంస్థాగతమైన కార్యకలాపాలను సమాన సామర్థ్యంతో నిర్వహించారు. ఆయన అంకితభావం, కఠోరశ్రమ ఫలితంగానే బీజేపీకి ఈనాటి విజయం సాధ్యమయ్యింది. ఈనాడు దేదీప్యమానంగా వెలుగుతున్న బీజేపీ పునాది రాళ్లలో ఆయనొకరు.-బండి సంజయ్ కుమార్,  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు,  కరీంనగర్ ఎంపీ.