2 స్కూళ్లలోనే అటల్​ టింకరింగ్​ ల్యాబ్​లు

  • భద్రాద్రి జిల్లాలో16 స్కూల్స్​ ఎంపికైనా రెండింటిలోనే ఏర్పాటు
  • కేంద్రానికి వివరాలు పంపించని ఆఫీసర్లు
  • నష్టపోతున్న పేద విద్యార్థులు

భద్రాచలం, వెలుగు: పాఠశాల స్థాయిలోనే విద్యార్థులను శాస్త్రీయ ఆలోచనల వైపు మళ్లించాలనే ఉద్దేశంతో కేంద్రం ప్రవేశపెట్టిన అటల్​ టింకరింగ్​ ల్యాబ్​ల ఏర్పాటు జిల్లాలో ముందుకెళ్లడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 16 హైస్కూళ్లకు ఈ ల్యాబ్​లను మంజూరు చేస్తే 2 చోట్ల మాత్రమే ఏర్పాటు చేశారు. కేంద్రం అడిగిన డాక్యుమెంట్లు సకాలంలో అందించకపోవడం వల్ల మిగతా స్కూళ్లలో  ల్యాబ్​లు ఏర్పాటు కాలేదు. ఒక్కో ల్యాబ్​కు కేంద్రం రూ.20 లక్షలు ఇస్తోంది. డాక్యుమెంట్లు ఇచ్చిన వెంటనే ఆ స్కూలులో రూ.10 లక్షలతో ఎలక్ట్రానిక్ డెవలప్​మెంట్, రోబోటిక్స్, ఇంటర్నెట్​ సెన్సార్లు, ప్రోటో టైపింగ్​ పరికరాలు, మెకానికల్, ఎలక్ట్రానిక్ పరికరాలు, ల్యాబ్​కు అవసరమైన అన్ని వస్తువులను సమకూర్చుతారు. మిగిలిన రూ.10 లక్షలు ఏడాదికి రూ.2లక్షలు చొప్పున ఐదేళ్లపాటు ల్యాబ్​ నిర్వహణ, ల్యాబ్​ మెంటర్​ వేతనం కోసం ఇస్తారు. ల్యాబ్​ ఏర్పాటు చేసిన తర్వాత రిపోర్టులు సకాలంలో కేంద్రానికి అందజేస్తే నిధులు వస్తాయి. కానీ ఇవేమీ పట్టనట్లు జిల్లా అధికారులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. 

ఎంపికైన పాఠశాలలు ఇవే..

భద్రాచలం, కిన్నెరసాని రెసిడెన్షియల్, మణుగూరు జడ్పీఎస్ఎస్, మణుగూరు కో ఎడ్యుకేషన్, మణుగూరు ఎక్స్​లెంట్, ఉల్వనూరు ఆశ్రమ హైస్కూల్, మణుగూరు సింగరేణి, కొత్తగూడెం సింగరేణి, అశ్వారావుపేట జడ్పీఎస్ఎస్, ఇల్లందు సింగరేణి, ఇల్లందులోని చెన్నెంగులగడ్డ, ఉప్పుసాక ఆశ్రమ హైస్కూల్, దమ్మపేట, చండ్రుగొండ స్కూళ్లను ఎంపిక చేశారు. వీటిలో ఇల్లందు సింగరేణి, చండ్రుగొండ హైస్కూళ్లకు రూ.10లక్షల చొప్పున నిధులు రిలీజ్​ చేసి ప్రయోగశాలలు ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం నిర్వహణ లోపం కారణంగా ఈ రెండు ల్యాబ్​లు కూడా నిరుపయోగంగానే ఉన్నాయి. ఆన్​లైన్​లో కేంద్రం అడిగిన డాక్యుమెంట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేస్తే ల్యాబ్​ ఏర్పాటు​ నిధులు వస్తాయి. 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఖాళీ ప్రదేశం, 400 మందికి పైగా విద్యార్థులు ఉండాలి. కంప్యూటర్​ ల్యాబ్, లైబ్రరీ, కరెంట్, ప్రయోగశాల, మ్యాథ్స్, సైన్స్ టీచర్లు తదితర అంశాలు కలిగి ఉండాలి. 

త్వరలోనే ఏర్పాటు చేస్తాం

జిల్లాకు 16 అటల్​టింకరింగ్​ ల్యాబ్​లు శాంక్షన్​ అయ్యాయి. సెలెక్ట్ అయిన స్కూళ్లు తమ వివరాలు అన్నీ కేంద్రానికి నేరుగా ఆన్​లైన్లో పంపాలి. అలా పంపినం. ఇదే విషయాన్ని అటల్​ ఇన్నోవేషన్​ మిషన్​కు కూడా జిల్లా నుంచి రిపోర్టు చేసినం. వాళ్ల నుంచి క్లియరెన్స్ వస్తే ల్యాబ్​లు ఏర్పాటు చేస్తం.  – చలపతిరాజు, జిల్లా సైన్స్ ఆఫీసర్