- అదేబాటలో మరికొంత మంది సీనియర్లు
- మిగిలిన నేతలతోనే ప్రచారంలోకి
- లీడర్, క్యాడర్ డీలాతో ఎన్నికల ప్రచారంపై ప్రభావం
ఆదిలాబాద్, వెలుగు : పదేళ్లు ఓవర్ లోడ్ తో దూసుకెళ్లిన కారు.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఓటమి వల్ల అన్ లోడింగ్‌తో డీలా పడుతోంది. గత నెల రోజుల నుంచి ఆ పార్టీకి చెందిన చాలా మంది ప్రజాతినిధులు, సీనియర్ లీడర్లంతా ఒక్కొక్కరు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామ చేసి కాంగ్రెస్ లో చేరుతున్నారు. దీంతో కారు పార్టీకి కష్టాల దారి ఎదురవుతోంది. ముఖ్యంగా ఆపార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు లోక్‌సభ ఎన్నికల ప్రచారంపై ఆ ప్రభావం తీవ్రంగా ఉంది. ఆత్రం సక్కు తరపున ప్రచారం చేసేందుకు పేరున్న నాయకులే కరువయ్యారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన సక్కుకు ఈసారి ఆ పార్టీ లోక్ సభ టికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలో ఉన్నప్పుడు టికెట్ కోసం అభ్యర్థుల్లో పోటీ ఉండేది. క్యాడర్ సైతం ఎన్నికల ప్రచారానికి ఫుల్ జోష్‌లో వెళ్లేది. ఇప్పుడు ఈరెండు ఆ పార్టీలో కనిపించడం లేదు. గ్రామ స్థాయి మొదలు కొని జిల్లా స్థాయి వరకు కీలక నేతలు, ప్రజాప్రతినిధులు పార్టీని వీడటంతో ఆత్రం సక్కుకు ఎన్నికల ప్రచారం ఓ సవాల్ గా మారింది.
పలుచగనే ప్రచార క్షేత్రంలోకి..
గతంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి ఇన్చార్జిలను నియమించి మరీ ప్రచార బాధ్యతలను అప్పగించేవారు. ప్రస్తుతం బీఆర్ఎస్ కు సంబంధించి పరిస్థితులన్నీ తారుమరు కావడంతో ప్రచారక్షేత్రం పలుచగా కనిపిస్తోంది. ఇటీవల ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పార్లమెంట్ సమావేశాలు నిర్వహించినప్పటికీ ఆశించిన స్థాయిలో నేతలు, కార్యకర్తలు రాలేదనే చర్చ జరిగింది. జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణాలతో డైలమాలో ఉన్న సీనియర్ నేతలు, క్యాడర్ పూర్తి గా ఢీలా పడిపోవడం, క్షేత్ర స్థాయిలో క్యాంపెయిన్ చేసేందుకు సైతం క్యాడర్ లేకపోవడంతో
బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు ఆందోళనకు గురవుతున్నట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒక పక్క చేరికలతో ఫుల్ జోష్ లో కనిపిస్తుండగా, బీజేపీ ఎంపీ అభ్యర్థి గొడం నగేశ్ తరపున ఆ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశాలు నిర్వహిస్తూ బలం చూపించుకుంటున్నారు. అదే బీఆర్ఎస్ క్యాడర్ లో మాత్రం మునుపటి ఉత్సాహం కనిపించడం లేదు. ఏండ్ల తరబడి పార్టీని నమ్ముకొని, ఎమ్మెల్యేలకు నమ్మిన బంటుగా ఉండే కింది స్థాయి క్యాడర్ సైతం బీఆర్ఎస్ ను వీడటం తో లోక్ సభ ఎన్నికల పై ప్రభావం చూపనుందని పలువురు చర్చించుకుంటున్నారు.
ఒకరిద్దరితోనే ముందుకు..
ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గంలోని ఒక్కో నియోజకవర్గంలో ఒకరిద్దరు సీనియర్లు తప్ప చెప్పుకోదగ్గ నేతలెవ్వరు కారు పార్టీలో లేరు. దీంతో ప్రచారక్షేత్రంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంపై తీవ్ర ప్రభావం కనిపించనుంది. 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గెలుపు ఇన్చార్జి బాధ్యతలను మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చూసుకున్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఇంద్రకరణ్ రెడ్డి ఓడిపోవడంతో పాటు తాజాగా ఆయన బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో నిర్మల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి బీఆర్ఎస్ కు పెద్ద దెబ్బతగిలింది.
ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకోవడంతో బీఆర్ఎస్ ఇన్చార్జి బాధ్యతలు ఇంత వరకు అధిష్టానం ఎవ్వరికి అప్పగించలేదు. ముథోల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విఠల్ రెడ్డి, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సైతం బీఆర్ఎస్ కు రాజీనామ చేయడంతో బీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికల ప్రచారంపై తీవ్ర ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఇటు ఆదిలాబాద్ జిల్లాలోనూ జెడ్పీ చైర్మెన్ జనార్ధన్ రాథోడ్, డీసీసీబీ చైర్మెన్ అడ్డి భోజారెడ్డి, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు ఇలా గ్రామ స్థాయి లీడర్ల వరకు పూర్తిగా బీఆర్ఎస్ ఖాళీ అయింది.
ఆసిఫాబాద్ లో ఎమ్మెల్యే కోవలక్ష్మి, బోథ్ లో ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్యే జోగురామన్నలతో పాటు ఎమ్మెల్సీ దండే విఠల్ మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కుతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకు కూడా నేతలు, కార్యకర్తల హాజరు అంతంత మాత్రంగానే కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది. ఇలా ఏడు నియోజకవర్గాల్లో అసలైన లీడర్లు పార్టీని వీడడంతో ఆత్రం సక్కు కు ఎన్నికల ప్రచారం కత్తిమీద సాములా తయారైంది. బీఆర్ఎస్ నుంచి లీడర్లు పార్టీ మారారే తప్ప తమ క్యాడర్ మా వెంటా ఉందని ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ఇంకా బీఆర్ఎస్ నుంచి మరికొంత మంది సీనియర్ లీడర్లు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.