ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ విజయం ఖాయమని, లక్ష మెజార్టీతో గెలుస్తున్నామని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆదిలాబాద్‌లోని ప్రజాసేవా భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎంతో శ్రమించారని వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరించాయన్నారు. గిరిజన, లంబాడాలు కాంగ్రెస్‌ను అక్కున చేర్చుకున్నాయని అన్న సుగుణ.. ముస్లింల అభివృద్ధికి పార్టీ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.
బీజేపీ వద్ద పైసలు తీసుకొని కాంగ్రెస్‌కు ద్రోహం: కంది
సమావేశంలో పాల్గొన్న నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ మాజీ నేతలు గండ్రత్ సుజాత, సంజీవ్ రెడ్డి బీజేపీ వద్ద పైసలు తీసుకుని కాంగ్రెస్‌కు ద్రోహం చేశారని ఫైర్అయ్యారు. కాంగ్రెస్ కార్యకర్తలను నమ్మించి మోసం చేశారని, బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ గెలుపును ఆపలేరన్నారు. ఈ సమావేశంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని తదితరులు పాల్గొన్నారు.