
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకురాలిగా మాజీ సీఎం, ఆప్ ఎమ్మెల్యే అతిశీ సింగ్ ఎన్నికయ్యారు. ఆదివారం (ఫిబ్రవరి 23) జరిగిన ఆమ్ ఆద్మీ పార్టీ శాసన సభపక్ష సమావేశంలో ఆప్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా అతిశీ పేరును ఖరారు చేశారు. తద్వారా ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకురాలిగా ఎన్నికైన తొలి మహిళగా అతిశీ రికార్డ్ సృష్టించింది. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఆప్ ఓడిపోవడంతో పాటు ఆ పార్టీ అగ్రనేతలు పరాజయం చవిచూశారు. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సౌరభ్ భరద్వాజ్, సత్యేంద్రజైన్ వంటి ఆప్ అగ్రనేతలు ఎన్నికల్లో ఓడిపోయారు.
అగ్రనేతలు ఓటమి పాలైనప్పటికీ.. అతిశీ మాత్రం కల్కాజీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిపై ఘన విజయం సాధించారు. కీలక నేతలు ఓటమి పాలుకావడంతో అతిశీ ప్రతిపక్ష నాయకురాలిగా ఎన్నికైంది. అధికార బీజేపీ కూడా సీఎంగా మహిళ ఎమ్మెల్యే రేఖా గుప్తాను నియమించడంతో ఆమెను ధీటుగా ఎదుర్కొనేందుకు ఆప్ కూడా మహిళ ఎమ్మెల్యేనే ప్రతిపక్ష నాయకురాలిగా ఎంపిక చేసింది. ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రతిపక్ష నాయకురాలిగా అతిశీని ఎన్నుకోవడంతో పాటు.. అసెంబ్లీ మొదటి సమావేశంలో లేవనెత్తాల్సిన ఎజెండాపైన ఆప్ శాసనసభా పక్షం చర్చించింది.
ఎల్ఓపీగా ఎంపికైన తర్వాత అతిషి మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ ప్రజలు మాకు ప్రతిపక్ష పాత్రను ఇచ్చారు.. ప్రజా తీర్పును గౌరవిస్తూ సమర్థవంతంగా ప్రతిపక్ష పాత్రను పోషిస్తామన్నారు. బలమైన ప్రతిపక్షం అంటే ఏమిటో అధికార బీజేపీకి చూపిస్తామన్నారు. ఢిల్లీలో బీజేపీ గెలిస్తే మొదటి క్యాబినెట్‌లోనే మహిళల ఖాతాల్లో రూ. 2500 వేస్తామని ప్రధాని మోడీ మోడీ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు మహిళల ఖాతాల్లో రూ.2500 జమ చేయాలని ఈ సందర్భంగా అతిశీ డిమాండ్ చేశారు.
కాగా, ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దాదాపు 26 ఏళ్ల తర్వాత దేశ రాజధానిలో కాషాయ పార్టీ విజయం సాధించగా.. 11 ఏండ్ల ఆప్ విజయ పరంపరకు బ్రేక్ పడింది. బీజేపీ శాలీమార్ బాగ్ ఎమ్మేల్యే రేఖా గుప్తాను తదుపరి ఢిల్లీ సీఎంగా ఎంపిక చేసింది. 2025, ఫిబ్రవరి 24వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ తొలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఇటీవల గెలిచిన ఎమ్మెల్యేల చేత స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.