ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ 2013, 2015లో ఢిల్లీకి ముఖ్యమంత్రి అయ్యాడు. అనంతరం 2020లో మరోసారి ఆప్ విజయం సాధించడంతో మూడోసారి ముఖ్యమంత్రి అయ్యాడు. అయినప్పటికీ, కేజ్రీవాల్ వరుసగా మూడుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినా ఆయన ఆతిశికి మంత్రి పదవి ఇవ్వలేదు. అయితే, తన నమ్మకమైన ఫాలోవర్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జైలులో ఉండగా, తాను కూడా జైలుకు వెళ్లొచ్చని పసిగట్టిన కేజ్రీవాల్ గత 6 నెలల్లోనే ఆమెను మంత్రిని చేశారు. కాగా, ఒకవేళ కేజ్రీవాల్‌కు చాయిస్ ఉండి ఉంటే, ఆయన ఆతిశిని ముఖ్యమంత్రిని చేసేవాడు కాదు.
ప్రస్తుతం కేజ్రీవాల్ తన ప్రతిష్టకు భంగం కలిగించే తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి, 2025లో జరగనున్నాయి. ఈ ఎన్నికలలో కేజ్రీవాల్ సారథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోతే, అది అతనికి లిక్కర్ పాలసీ కేసుల్లో మరింత సమస్యలను సృష్టిస్తుంది. ఢిల్లీలో ఆప్ ఓడిపోతే దాని ప్రభావం ఇతర రాష్ట్రాలపై ముఖ్యంగా అతను నియంత్రించే పంజాబ్ ప్రభుత్వంపై కూడా చూపుతుంది.
కేజ్రీవాల్‌ను బీజేపీ రాజకీయంగా వ్యతిరేకిస్తుంది. మరోవైపు కేజ్రీవాల్ ఇండియా కూటమిలో ఉన్నా ఎన్నికల్లో కాంగ్రెస్‌పై ఆప్ పంజాబ్ తదితర రాష్ట్రాల్లో ముఖాముఖి పోటీ చేస్తోంది. దీంతో ఆప్ అధినేత కేజ్రీవాల్ కాంగ్రెస్‌కు కూడా విశ్వసనీయ మిత్రుడు కాదు. కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే, కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయాల్సినంత కఠినమైన షరతులను కోర్టు విధించింది.
దీంతో కేజ్రీవాల్ ప్రత్యామ్నాయాన్ని వెతకాల్సి వచ్చింది. కేజ్రీవాల్ తన భార్య సునీత కేజ్రీవాల్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రిని చేస్తారని అందరూ ఊహించారు. అయితే తన భార్యను సీఎం పీఠంపై కూర్చోబెడితే రాజకీయంగా తాను విపరీతమైన విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందని కేజ్రీవాల్‌కు తెలుసు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కేవలం నెలల సమయం మాత్రమే ఉంది. అందుకే తన భార్యను ముఖ్యమంత్రిని చేయకుండా ఎత్తుగడ వేసి కేజ్రీవాల్ రాజకీయ విమర్శలను తప్పించుకున్నారు.
అత్యంత విశ్వసనీయురాలిగా ఆతిశి ఎంపిక
తన స్థానంలో మరో వ్యక్తిని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టక తప్పనిపరిస్థితులు తలెత్తడంతో... కేజ్రీవాల్ అతని స్థానానికి హానిచేయని వ్యక్తి కోసం వెతికారు. ఈక్రమంలో ఆయన తన ప్రస్తుత మంత్రుల సామర్థ్యం, విధేయత రెండింటిని పూర్తిగా విశ్వసించలేకపోయాడు. కానీ, 5 నెలల స్వల్ప కాలానికి ఆతిశి అత్యంత అనుకూలమైనదిగా కనిపించడంతో కేజ్రీవాల్ ఆమెను ముఖ్యమంత్రిని చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆతిశి విద్యావంతురాలు అంతేకాక రాజకీయ చతురత, చరిష్మా కలిగి ఉన్నారు. ఢిల్లీ ఓటర్లు ఆమెను ఇష్టపడవచ్చు.
ముఖ్యమంత్రులు తమ సహచరులకు ముఖ్యమంత్రిగా పదవి ఇచ్చినప్పుడు, వారు సాధారణంగా తమపై తిరుగుబాటు చేస్తారని రాజకీయ అనుభవ రీత్యా కేజ్రీవాల్‌కు తెలుసు. గతంలో ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇద్దరికీ తమ రాజకీయ సహచరులే శత్రువులుగా మారిన సంగతి తెలిసిందే. క్రీయాశీలక రాజకీయవేత్త ఆతిశిని ఓటర్లు ఎక్కువగా ఇష్టపడతారని కేజ్రీవాల్ ఒకింత ఆందోళన చెందుతున్నారనేది మరో కోణం.
విద్యావంతులను కేజ్రీవాల్ ఎప్పుడూ నమ్మలేదు
2012లో అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ సమయంలో కేజ్రీవాల్ చుట్టూ సీనియర్ న్యాయవాదులు, రిటైర్డ్ అధికారులు, రచయితలు, కవులు, మేధావులు ఉన్నారు. వారు రాజకీయ, పాలనాపరమైన మార్పును కోరుకున్నారు. ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, నాయకుడు యోగేంద్ర యాదవ్ వంటి వారికి నాయకత్వం వహించారు. అయితే, కేజ్రీవాల్ సారథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించి ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే అలాంటి వారందరినీ ఆప్ నుంచి అక్షరాలా బహిష్కరించారు. మరోవైపు కేజ్రీవాల్ తన గురువు అన్నా హజారేకు కూడా దూరంగా ఉన్నారు.
సుప్రీం షరతులు, కేజ్రీ రాజీనామాకు దారితీశాయి!
అయితే సుప్రీంకోర్టు కారణంగా కేజ్రీవాల్‌కు పదవి నుంచి తప్పుకోవడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. రాజీనామా విషయంలో కేజ్రీవాల్ సరైన చర్యనే తీసుకున్నారని చెప్పవచ్చు. కేజ్రీవాల్ తన ప్రత్యామ్నాయం కోసం వెతికారు. ఆతిశి ఉత్తమ నాయకురాలు కావడంతో ఎన్నికలకు వెళ్లేముందు కేజ్రీవాల్ ఆమెను అధికార పీఠంపై కూర్చోబెట్టారు. అయితే, కేజ్రీవాల్‌కి ఆతిశిపై తీవ్రమైన అపనమ్మకం ఉంది. ఆతిశీని చాలా తెలివిగల రాజకీయ నాయకురాలిగా కేజ్రీవాల్ పరిగణించాడు. ఆమె తన సొంత ఇమేజ్‌ను జాగ్రత్తగా పెంచుకుంది. దీంతో ఆమెను తప్పించేందుకు కేజ్రీవాల్ ప్రయత్నించారు. కానీ, తాను జైలుకు వెళతానని తెలియగానే ఇక తప్పని పరిస్థితిలో కేజ్రీవాల్ ఆతిశిని మంత్రిని చేశారు.
కేజ్రీవాల్ ఎదుర్కొంటున్న కీలక సమస్యలు
త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ తప్పక గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ కేజ్రీవాల్ ఎన్నికల్లో ఓడిపోతే లిక్కర్ స్కామ్‌పై పోరాటం చేయడంలో ఆయనకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ఆయనపై కేసు బలంగా ఉందని పేర్కొంది. కాగా, కేజ్రీవాల్ కూడా ముందస్తు ఎన్నికలు కోరుకుంటున్నారు. ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్‌లు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలతో బిజీగా ఉన్నాయి. అనంతరం 2025 ఫిబ్రవరిలో బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఢిల్లీ పీఠంపై దృష్టి సారించనున్నాయి. కేజ్రీవాల్ దాన్ని తప్పించాలని కోరుకుంటున్నారు. అయితే, ఎన్నికల సంఘం కేజ్రీవాల్ కోరుకుంటున్న ముందస్తు ఎన్నికలకు అంగీకరించడం అనుమానమే. విపక్షం కూడా ఆతిశీ డమ్మీ ముఖ్యమంత్రి అని ఆరోపణలు చేస్తోంది. ఆ ఆరోపణలకు కేజ్రీవాల్ సమాధానం చెప్పాలి.
ఆతిశిని సీఎంను చేయకుండా కేజ్రీవాల్ తప్పించుకోలేకపోయారు
ఆతిశి అదృష్టం ఆమెను ముఖ్యమంత్రి పదవి వైపు తీసుకువెళ్లింది. వాస్తవానికి ఆమెకు బలమైన రాజకీయ పునాది లేదు. ఒకవేళ లిక్కర్ స్కాం జరగకపోతే అతివి ఎప్పటికీ మంత్రికానీ, ముఖ్యమంత్రికానీ అయ్యేది కాదు. మద్యం కుంభకోణం వల్ల చాలా మంది కెరీర్‌లు నాశనం అయ్యాయి. కానీ, విధి తమాషా ఆటలు ఆడుతుంది. కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో పాటు పలువురు టీడీపీ, బీఆర్ఎస్ నేతలు జైలుకు వెళ్లారు. ఒకవైపు విధి వారిని జైలుకు పంపితే మరోవైపు ఆతిశిని విధి అందంలం ఎక్కించింది.
ఈ సంఘటనలన్నింటి నుంచి తెలుస్తున్న పెద్ద పాఠం ఏమిటంటే, రాజకీయాలు పూర్తిగా ఊహించలేనివి. రాజకీయ నాయకులు చాలా అరుదుగా తెలివైన వ్యక్తులతో కలిసి తమను తాము నిరూపించుకోవడానకి ఇష్టపడతారు. ఆతిశి ఎప్పుడూ తనకు ముఖ్యమంత్రిని కావాలన్న ఆశయం లేనట్లుగా, ఓపికగా వ్యవహరించింది. కేజ్రీవాల్ కేబినెట్ మొత్తంలో 70 మంది ఎమ్మెల్యేలలో 60 మంది ఎమ్మెల్యేలు కూడా సాధించలేనిది ఆతిశి సాధించింది. ఆతిశి ఇప్పుడు భారతదేశ రాజధాని ఢిల్లీకి ముఖ్యమంత్రి అవుతున్నారు. కేజ్రీవాల్ ఆమెను సీఎంను చేయకుండా తప్పించుకోలేకపోయారు. కుట్రల కంటే విధి ఎల్లప్పుడూ బలంగా ఉంటుంది.
కేజ్రీవాల్ మళ్లీ సీఎం కావడానికి సుప్రీంకోర్టు అనుమతిస్తుందా?
ప్రస్తుతం సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ మాత్రమే ఇచ్చింది. కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా పని చేయలేనివిధంగా కఠినమైన షరతులు విధించింది. ఒకవేళ కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినా.. మళ్లీ అదే గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఎన్నికల్లో గెలిచినా కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అవుతారా అనేది అనుమానమే. అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ గెలిస్తే, ఆయనపై ఉన్న షరతులను ఎత్తివేస్తామని సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు విషయంలో చెప్పలేదు. సుప్రీంకోర్టు ఆయనకు కేవలం బెయిల్ మాత్రమే ఇచ్చింది. అయితే, లిక్కర్ స్కాం కేసు బలమైన కారణాలపై ఆధారపడి ఉందని సుప్రీంకోర్టు కూడా అదే సమయంలో పేర్కొనడం గమనార్హం. వాస్తవానికి లిక్కర్ స్కామ్ కేసు నడుస్తున్నంత కాలం కేజ్రీవాల్ నిజంగా ముఖ్యమంత్రి కాలేరు.