
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం పదవికి అతిశీ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆదివారం (ఫిబ్రవరి 9) రాజ్ భవన్కు వెళ్లి అతిశీ.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసి రాజీనామా లేఖ సమర్పించారు. అతిశీ రాజీనామాను ఆమోదించిన సక్సేనా.. అనంతరం ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఆప్ ఓటమి నేపథ్యంలో అతిశీ సీఎం పదవికి రిజైన్ చేశారు. 2025, ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా.. ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో ఆప్ జైత్రయాత్రకు ఢిల్లీ ఓటర్లు బ్రేక్ వేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి షాకిస్తూ.. ఢిల్లీలో బీజేపీకి పట్టం కట్టారు ఓటర్లు.
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 48 చోట్ల విజయ ఢంకా మోగించిన బీజేపీ.. 26 సంవత్సరాల సుదీర్ఘ సమయం తర్వాత హస్తినా పీఠం దక్కించుకుంది. 12 సంవత్సరాలుగా వరుస విజయాలు సాధిస్తూ వచ్చిన ఆప్ ఈ సారి 22 సీట్లకే పరిమితమైంది. 22 సీట్లు సాధించడం పక్కన పెడితే.. ఆప్ అధినేత కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్, భరద్వాజ్ వంటి అగ్రనేతలు ఓటమి పాలు కావడం సంచలనంగా మారింది. అయితే.. అగ్ర నేతలు ఓటమి పాలైనప్పటికీ.. అతిశీ మాత్రం విజయం సాధించడం గమనార్హం.
కల్కాజీ నుంచి బరిలోకి దిగిన అతిశీ.. బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరిని 3,521 ఓట్ల తేడాతో ఓడించారు. అయినప్పటికీ ఆప్ ఓటమి పాలు కావడంతో అతిశీ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీలో సామాన కార్యకర్తగా ప్రస్థానం మొదలుపెట్టిన అతిశీ సీఎం స్థాయి వరకు ఎదిగారు. ఢిల్లీని షేక్ చేసిన లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ జైలుకు వెళ్లడంతో ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేశారు. మళ్లీ ఎన్నికల్లో ఆప్ గెలిచే వరకు సీఎం పదవి చేపట్టనని కేజ్రీవాల్ శపథం చేశారు. ఈ నాటకీయ పరిణామాల మధ్య అతిశీ ఢిల్లీ సీఎం పగ్గాలు చేపట్టారు. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి పాలు కావడంతో అతిశీ సీఎం పదవికి రాజీనామా చేశారు.