Delhi New Chief Minister: ఢిల్లీ కొత్త సీఎంగా ఆతిశీ మర్లెనా సింగ్

Delhi New Chief Minister: ఢిల్లీ కొత్త సీఎంగా ఆతిశీ మర్లెనా సింగ్

న్యూఢిల్లీ: ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఆప్ మహిళా నేత ఆతిశీ మర్లెనా సింగ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆప్ ఎమ్మెల్యేల కీలక సమావేశంలో ఆతిశీని శాసనసభా పక్షనేతగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా కొత్త ముఖ్యమంత్రిగా ఆతిశీని ప్రతిపాదించడం గమనార్హం.

 

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ మంగళవారం సాయంత్రం సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు. సెప్టెంబరు 26, 27 తేదీల్లో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆప్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

సీఎం రేసులో గోపాల్‌‌ రాయ్‌‌, ఎంపీలు రాఘవ్ చద్దా, సంజయ్ సింగ్ పేర్లు వినిపించాయి. వీరితో పాటు మంత్రులు కైలాశ్‌‌ గెహ్లాత్, ఇమ్రాన్‌‌ హుస్సేన్‌‌ పేర్లూ తెరపైకొచ్చాయి. దళిత నేతనుగానీ, మైనారిటీ నేతనుగానీ సీఎంను చేసే అవకాశాలూ లేకపోలేదనే చర్చ జరిగింది. 

ఎవరైనా కూడా కొన్ని నెలల పాటు మాత్రమే సీఎంగా ఉంటారు. నాయకత్వాన్ని బలోపేతం చేసి పార్టీ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగే సమర్థ నేతను సీఎంగా ఎన్నుకోవాలని ఆప్ భావించింది. ప్రధానంగా ఐదుగురి పేర్లు వినిపించాయి. వీరిలోనూ ఆతిశీ, సౌరభ్​ భరద్వాజ్ ముందు వరుసలో ఉన్నప్పటికీ ఆతిశీనే సీఎం పదవి వరించింది.