ప్రపంచం చూపు భారత్ ​వైపు : జి. కిషన్​ రెడ్డి

‘అతిథి దేవో భవ’ అనేది భారతీయ సనాతన నినాదం. భారతదేశం జీ20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన నెల రోజుల నుంచి భారతీయ ఆతిథ్యం ఎలా ఉంటుందనే దానిపై ప్రపంచం దృష్టి సారించింది. శతాబ్దానికోసారి ఏదో ముప్పు వస్తదన్నట్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. దాని తదనంతర పరిణామాలు, ఆర్థిక అనిశ్చితి, వాతావరణ సంక్షోభం లాంటి కనీవినీ ఎరుగని సవాళ్లను ప్రపంచం ఇప్పుడు ఎదుర్కొంటున్నది. రెండేండ్లుగా ప్రపంచ శక్తిసామర్థ్యాల్లో సింహభాగం కరోనా మహమ్మారి నుంచి ప్రజల ప్రాణాలు రక్షించేందుకు, వారి జీవనోపాధులను కాపాడేందుకే వినియోగించాల్సి వచ్చింది. ఇలాంటి అనేకానేక అనిశ్చిత, అస్థిరమైన పరిస్థితులు ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న నేపథ్యంలో అన్ని దేశాల సమష్టి భవిష్యత్తు దృష్ట్యా జీ20కి అధ్యక్షత వహించడాన్ని భారత్​ఒక అవకాశంగా పరిగణిస్తున్నది. అలాగే భారత అధ్యక్షతను ‘4డీ’(డిలిషన్​ ఆఫ్​ కాంట్రడిక్షన్స్, డెవలప్​మెంట్, డీకార్బనైజేషన్, డిజిటలైజేషన్)లపై దృష్టి పెట్టే అవకాశంగా ప్రపంచం భావిస్తున్నది. ఈ మేరకు వైరుధ్యాల తొలగింపు, ప్రగతి, కర్బన విముక్తి, డిజిటలీకరణ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల వేగవంతమైన, సమాన, సమ్మిళిత వృద్ధి ఉంటుందని, వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంటుందనేది వాటి విశ్వాసం. 

వైరుధ్యాల తొలగింపు - దౌత్యనీతి

ఈ ఏడాది సెప్టెంబరులో షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా రష్యా ప్రధానితో భేటీలో “నేటి యుగం యుద్ధ యుగం కారాదు” అని ప్రధానమంత్రి మోడీ చేసిన ప్రకటన ప్రపంచమంతటా ప్రతిధ్వనించింది. రష్యా-– ఉక్రెయిన్ వివాదంపై జీ20 ఉమ్మడి ప్రకటనకు ఇది ప్రాతిపదిక కానుంది. ఇది ప్రపంచ సంఘర్షణల తీవ్రతను తగ్గించడంలో జరిగిన మొదటి కృషి. బహుళ-సమీకరణ, నిబంధనాధారిత బహుపాక్షికతకు ప్రోత్సాహం భారత విదేశాంగ, ఆర్థిక విధానం ప్రాధాన్యాలు. భారతదేశం అనేక బహుపాక్షిక వేదికల్లో భాగస్వామి. వీటిలో ప్రతి ఒక్కటీ ప్రపంచాన్ని సురక్షితంగా మార్చడంలో నిర్మాణాత్మక పాత్రను పోషిస్తున్నాయి. అలాగే వర్ధమాన దేశాల సమస్యలను కూడా వినిపించడంతోపాటు వాటి ప్రయోజనాల పరిరక్షణకూ ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జీ20 అధ్యక్ష పదవి ద్వారా భారతదేశం ఇతర శక్తిమంతమైన అగ్ర దేశాలకు, తనను విశ్వసించే చిన్న-వర్ధమాన దేశాలకు మధ్య వారధిగా వ్యవహరించే అవకాశం ఉంది.

సంయుక్త సౌభాగ్యం - సమష్టి భవిష్యత్తు

భారతదేశం తన ఆలోచనలను, విజ్ఞానాన్ని ప్రపంచంలోని భౌగోళిక, -సాంస్కృతిక వైరుధ్యాలన్నిటా స్వేచ్ఛగా పంచుకుంది. జీ20 భారత అధ్యక్షతకు “ఒకే భూమి.. ఒకే కుటుంబం.. ఒకే భవిష్యత్తు” అనే ఇతివృత్తంతో మహోపనిషద్ ప్రబోధిత ‘వసుధైక కుటుంబం’.. అంటే- ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే అర్థమిచ్చే సంస్కృత పదబంధం స్ఫూర్తితో రూపొందింది. ఈ ఇతివృత్తం మన ప్రాచీన తత్వశాస్త్ర ప్రేరణను ప్రతిధ్వనించడమే కాకుండా బాధ్యత, కార్యాచరణ, శ్రేయస్సు దిశగా ఉమ్మడి కృషికీ మార్గనిర్దేశం చేస్తుంది. దేశంలో 20,000 భాషలు, విభిన్న సంస్కృతులున్న నేపథ్యంలో ప్రపంచ ఉమ్మడి భవిష్యత్తు, పరస్పర ఆధారిత ప్రపంచ క్రమంపై ఆలోచించడం భారత్​కు సహజమైన లక్షణమే. ప్రసిద్ధ తమిళ కవి కనియన్ పూంగున్రానార్ తన కవితలో- “భూమిపై గల అన్ని ప్రాంతాలు మా పట్టణాలే. ప్రజలంతా మా బంధువులే.. అందరూ సార్వత్రిక పూర్వీకుల నుంచి ఉద్భవించిన వారే” అని క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలోనే భారత తాత్త్వికతను ప్రతిబింబించారు. ఈ తాత్త్వికత తరతరాలుగా సంక్రమించడమే కాకుండా మన జాతీయ చైతన్యంలోనూ మూర్తీభవించింది. ప్రపంచంతో భారతదేశం ఎలా మమేకమైన తీరును నేడు అది నిరంతరం ప్రతిబింబిస్తున్నది. సంక్షోభ సమయాల్లో, భయంకరమైన ప్రపంచ మహమ్మారి వేళ భారతదేశం 150 దేశాలకు కరోనా సంబంధిత వైద్య, ఇతరత్రా సహాయాన్ని అందించింది.  94 దేశాలు, 2 ఐక్యరాజ్య సమితి సంస్థలకు సుమారు7.5 కోట్ల టీకాల మోతాదులు అందించింది. రష్యా-– ఉక్రెయిన్ మధ్య ఘర్షణల నేపథ్యంలో భారత ప్రభుత్వం 90కిపైగా విమానాలను నడిపి 22,500 మంది భారతీయ విద్యార్థులను స్వదేశం తరలించడమేగాక సుమారు 20 దేశాలకు చెందిన150 మందికిపైగా పౌరులను రక్షించింది. అమృతకాలంలో భాగంగా రాబోయే 25 ఏండ్లకు భారత్‌ నిర్దేశించుకున్న స్వీయ లక్ష్యాలు ప్రస్తుతం జీ20కి అధ్యక్షత చేపట్టిన నేపథ్యంలో ఉమ్మడి శ్రేయస్సుతో భాగస్వామ్య ప్రపంచ భవిష్యత్తుకు ప్రాతిపదిక కాగలవు. ఆ మేరకు అంతర్జాతీయ శాంతిని ప్రోత్సహిస్తూ, సుస్థిర, సంపూర్ణ, సమ్మిళిత విధానాలతో న్యాయమైన- సమాన వృద్ధికి ఊతమిచ్చే నిబంధనాధారిత ప్రపంచ క్రమం కోసం కృషి అవసరం. అందుకు తగిన కార్యాచరణాధారిత, అభివృద్ధి-ఆధారిత అధ్యక్షత బాధ్యతలను భారత్‌ నిర్వర్తిస్తుంది. లక్ష్యాలు- ఆదర్శాలు ఎలాంటివైనా వాటిని సాధించడమే మనముందున్న ప్రధాన కర్తవ్యం.

డిజిటలీకరణ - చివరి వరుస దాకా ప్రయోజనాలు

భారతదేశం 2005-–2021 మధ్య 41.5 కోట్లమంది ప్రజలకు పేదరికం నుంచి  విముక్తి కల్పించగలిగింది. గత 8 ఏండ్లుగా సాంకేతికత, డిజిలీకరణ వినియోగంతో పేదరిక నిర్మూలనకు జరిగిన వేగవంతమైన కృషిని మనం చూశాం. కేంద్ర ప్రభుత్వ నేతృత్వంలో చేపట్టిన కార్యక్రమాల ద్వారా 2014లో బ్యాంకింగ్ వ్యవస్థకు బయట ఉన్న 26 కోట్లమంది మహిళలు సహా పేదలు, అణగారిన వర్గాల ప్రజల కోసం దాదాపు 50 కోట్ల బ్యాంకు ఖాతాలను భారత్‌ విజయవంతంగా ప్రారంభించింది. భారత డిజిటల్ గుర్తింపు వ్యవస్థ- ఆధార్, ఏకీకృత చెల్లింపుల వేదిక(యూపీఐ) వినియోగం ద్వారా చేపట్టిన కార్యక్రమాలు వ్యక్తిగత స్థాయిలో సంక్షేమ ప్రయోజనాల బదిలీని సులభతరం చేశాయి. ప్రభుత్వ పథకాల అంతిమ లబ్ధిదారులకు 15 శాతం (రూపాయికి 15 పైసలు) మాత్రమే అందుతున్నదని1980 దశకం నాటి ఒక ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. కానీ, 2020లో ప్రపంచమంతా మహమ్మారి కోరల్లో చిక్కుకున్నపుడు కూడా క్లిష్టమైన లక్ష్యనిర్దేశిత నగదు బదిలీ ద్వారా భారతదేశం పేదల జీవనోపాధిని పరిరక్షించగలిగింది. భారీ జనాభాకు సరిపోయే విధంగా గుర్తింపు వ్యవస్థలు, ప్రత్యక్ష చెల్లింపు వ్యవస్థలు వంటి ప్రపంచస్థాయి ప్రభుత్వ డిజిటల్‌ మౌలిక సదుపాయాలు గల భారతదేశం నేడు మిగిలిన ప్రపంచానికి ఒక ఆదర్శ నమూనాగా నిలిచింది. కరోనా సంక్షోభ సమయంలోనూ ‘కోవిన్‌’ పోర్టల్​ద్వారా తన టీకా కార్యక్రమాన్ని దేశం భారీస్థాయిలో నిర్వహించింది. 200 కోట్లకుపైగా వ్యాక్సిన్​డోసుల పంపిణీని సజావుగా, విజయవంతంగా పూర్తి చేయగలిగింది. అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాలు ఇలాంటి వ్యవస్థలను అనుసరిస్తాయి. దీనికి సంబంధించి తన అనుభవాన్ని, ఆచరణలను భారతదేశం మిగిలిన ప్రపంచంతో పంచుకుంటుంది.

అభివృద్ధి - కర్బన విముక్తి

భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెంది, భారతీయులు మరింత సంపన్నులుగా మారినపుడు దేశ ఇంధన అవసరాలూ పెరుగుతాయి. అందుకే 2030 నాటికి 40 శాతం విద్యుదుత్పాదనను శిలాజేతర ఇంధన వనరులతో సాధిస్తామని పారిస్‌లో 2015 నాటి కాప్‌-21 సదస్సు సందర్భంగా భారతదేశం ఒక ప్రకటన చేసింది. కానీ, ఈ లక్ష్యాన్ని ఏకంగా ఒక దశాబ్దం ముందుగానే.. అంటే- 2021 నవంబరులోనే సాధించడం విశేషం. ఈ మేరకు ప్రగతి సాధన, పర్యావరణ పరిరక్షణ మధ్య  వైరుధ్యమేదీ లేకుండా సమాంతరంగా సాగవచ్చని భారతదేశం ప్రపంచానికి రుజువు చేసింది. ఎన్విరాన్​మెంటల్​జస్టిస్​ద్వారా వాతావరణ మార్పు సమస్యలను ఎదుర్కోవడం గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తరచూ చెబుతుంటారు. ఈ మేరకు వాతావరణ ఆర్థిక -సాంకేతిక పరివర్తన దిశగా అభివృద్ధి చెందిన దేశాలు విభిన్న బాధ్యతలు నిర్వహించే ఒక సమానచట్రం అవసరమని ఆయన చెప్పారు. ఈ దిశగా జీ20లో చర్చలు కొనసాగించడానికి, కూటమి దేశాలు విభిన్న బాధ్యతలకు కట్టుబడేలా చూడటానికి భారతదేశం భరోసా కల్పించింది.

- జి. కిషన్​ రెడ్డి, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి