ENG vs SL 2024: ఇంగ్లాండ్ నయా ఆల్ రౌండర్: సెంచరీతో అట్కిన్సన్ విశ్వరూపం

ENG vs SL 2024: ఇంగ్లాండ్ నయా ఆల్ రౌండర్: సెంచరీతో అట్కిన్సన్ విశ్వరూపం

ఇంగ్లాండ్ బౌలర్ గా టెస్ట్ జట్టులోకి వచ్చి తొలి మ్యాచ్ లోనే గస్ అట్కిన్సన్ సంచలన స్పెల్ తో అరంగేట్రాన్ని ఘనంగా చాటుకున్నాడు. వెస్టిండీస్ తో జరిగిన మూడు మ్యాచ్ ల సిరీస్ లో 22 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ ప్రదర్శనకు గాను జూలై నెలలో ఇంగ్లాండ్ సీమర్ గుస్ అట్కిన్సన్ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌ అవార్డును గెలుచుకున్నాడు. అయితే ప్రస్తుతం జరుగుతున్న శ్రీలంక సిరీస్ లో అట్కిన్సన్ బ్యాటింగ్ లో చెలరేగడం విశేషం.

రెండో రోజు ఆటలో భాగంగా లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో అట్కిన్సన్ సెంచరీతో చెలరేగడం విశేషం. శుక్రవారం (ఆగస్టు 30) 103 బంతుల్లో సెంచరీ సాధించి.. 118 పరుగుల వద్ద ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్ లో 14 ఫోర్లు, 4 సిక్సర్లు ఉండడం విశేషం. అతని స్ట్రైక్ రేట్ 100 కి పైగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. తొలి రోజు 74 పరుగులతో నాటౌట్‌తో ఇన్నింగ్స్ కొనసాగించిన ఈ ఇంగ్లీష్ పేసర్ బౌండరీలతో హోరెత్తిస్తూ కెరీర్ లో తొలి సెంచరీని పూర్తిచేసుకున్నాడు.  

అట్కిన్సన్ బ్యాటింగ్ లో వీర విహారం చేయడంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 427 పరుగులకు ఆలౌటైంది. తొలి రోజు ఆటలో రూట్ (143) సెంచరీ చేశాడు. లంక బౌలర్లలో అసిత ఫెర్నాండోకు 5 వికెట్లు దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక లంచ్ సమయానికి 2 వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. ఓపెనర్లు మదుష్కా (7), కరుణ రత్నే (7) విఫమలమయ్యారు.