పండుగలంటే ఇంటికి, కుటుంబానికి కొత్త శోభ తెస్తాయి. ముఖ్యంగా తెలుగింటి పండుగలంటే సంప్రదాయాలకు, సంబురాలకు కేరాఫ్ అడ్రస్. ఇవి ఒకరోజు రెండ్రోజుల పండుగల్లానే కనిపించినా పురాణ మూలాలు ఉండి, ఎంతో శక్తి, పవిత్రతను కూడగట్టుకునే అంశాలు ఉంటాయి. అలాంటి పండుగల్లో ‘అట్లతద్ది’ ఒకటి. మంగళవారం ( అక్టోబర్ 31) జరుపుకునే ఈ పండుగ గురించి...‘అట్లతద్ది’ పండుగంటే కేవలం దేవుడితో ముడిపడి ఉన్న పండుగే కాదు. సంప్రదాయాలను, సంబురాల్ని, సుఖసంతోషాలను కలిపి అందించే పండుగ.
ముఖ్యంగా అమ్మాయిలు జరుపుకునే పండుగ. ఆశ్వయుజ పౌర్ణమి వెళ్ళిన మూడో రోజు బహుళ తదియ( అక్టోబర్ 31) నాడు ఈ పండుగ వస్తుంది. అందుకే దీన్ని ‘అట్ల తదియ’ అని కూడా పిలుస్తారు. అట్లతద్దికి ముందు గోరింటాకు పెట్టుకుంటారు. తెలిసినవాళ్లను పిలుస్తారు. అట్లతద్ది రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి ఉపవాసం ఉంటారు. ఆ తర్వాత అన్నం, గోంగూర పచ్చడి, పెరుగుతో తిని పడుచు పిల్లలు ఉయ్యాల ఊగుతూ హడావిడి చేసి... ఆ రోజంతా ఉపవాసం ఉంటారు.
అట్లతద్ది నాడు ఉయ్యాల కట్టి ‘అట్ల తద్దోయ్.. ఆరట్లోయ్, ముద్దపప్పోయ్ మూడట్లోయ్’ అంటూ పాటలు పాడుతూ ఉయ్యాల ఊగుతారు కూడా. అందుకే దీన్ని‘ఉయ్యాలపండగ’ అని కూడా అంటారు. ఈ ఉపవాసంతోనే పూజా కార్యక్రమాలు మొదలు పెడతారు. ఇంటిలో తూర్పు వైపు గౌరీ పూజ మంటపము ఏర్పాటు చేస్తారు. ధూప, దీప, నైవేద్యాలు పెట్టి, వినాయక పూజ తర్వాత, గౌరీ స్తోత్రము, శ్లోకాలు, పాటలు పాడతారు. సాయంత్రం చంద్రుడ్ని చూసిన తర్వాత గౌరీదేవికి పదకొండు అట్లు నైవేద్యంగా ఇస్తారు. గౌరీదేవి దగ్గర పెట్టిన ఈ నైవేద్యాన్ని తాంబూలంతో వాయనంగా ఇస్తారు. ముత్తైదువులకు అట్లు, ఫలాలు వాయనం ఇస్తారు.
అట్లతద్ది నోము కథ చెప్పుకొని, అక్షింతలు వేసుకుంటారు.శివుడ్ని భర్తగా పొందాలని కోరుకుంటుంది గౌరీదేవి. ఈ విషయాన్ని గ్రహించిన నారదుడు గౌరితో మాట్లాడతాడు. ఈ కోరిక ఫలించాలంటే చేయాల్సిన వ్రతం గురించి సూచిస్తాడు. అలా నారదుని సూచనతో గౌరీదేవి చేసిన వ్రతమే ‘అట్లతద్ది’ అని పురాణాలు చెబుతున్నాయి.
అట్లతద్ది రోజున అట్లు నైవేద్యం వెనుక రీజన్ ఏమిటంటే..
అట్లతద్ది రోజున 11 అట్లను వేసి నైవేద్యంగా గౌరమ్మకు సమర్పిస్తారు. ఇలా చేయడానికి కారణం.. నవగ్రహాల్లోని కుజుడికి అట్లు అంటే ఇష్టమట. అందుకు నైవేద్యంగా అట్లను పెట్టడం వలన కుజుడి అనుగ్రహం కలిగి వివాహం కానీ యువతికి మంచి భర్త లభిస్తాడని విశ్వాసం. అంతేకాదు పెళ్ళైన దంపతుల్లో సంసారం సుఖంలో ఎటువంటి అడ్డంకులు రావని విశ్వాసం.
అట్లను మినుములు, బియ్యం కలిపి వేస్తారు.. మినుములు రాహువుకి .. బియ్యం చంద్రుడికి సంబంధించిన ధాన్యాలు. కనుక అట్లను దానం ఇవ్వడం వలన గర్భ దోషాలు తొలగుతాయని విశ్వాసం. ఈ అట్లను గౌరీ దేవికి నైవేద్యంగా సమర్పించడం వలన నవ గ్రహాలు శాంతించి మహిళలు సుఖ సంతోషాలతో జీవిస్తారని విశ్వాసం.