
కామారెడ్డి టౌన్, వెలుగు : ఏటీఎం కార్డును మార్చి అకౌంట్‌లో ఉన్న రూ. 40 వేలు చోరీ చేశాడు ఓ వ్యక్తి. కామారెడ్డి టౌన్ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన సిరిసిల్ల రాజు శుక్రవారం డబ్బులు డ్రా చేసేందుకు ఎస్‌బీఐ ఏటీఎం వద్దకు వెళ్లాడు. పైసలు రాకపోవడంతో అతడి వెనుకాల ఉన్న ఓ గుర్తు తెలియని వ్యక్తి.. తాను డబ్బులు తీసి ఇస్తానని రాజు నుంచి ఏటీఎం కార్డు తీసుకున్నాడు. డబ్బులు డ్రా చేస్తున్నట్లు ప్రయత్నం చేసి కొద్దిసేపటి తర్వాత పైసలు రావట్లేదని చెప్పి అతడి కార్డుకు బదులుగా మరో కార్డును రాజుకు ఇచ్చి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత తన అకౌంట్ నుంచి రూ. 40 వేలు డ్రా అయినట్లు రాజుకు మెసేజ్ రావడంతో బ్యాంక్‌కు వెళ్లి ఆరా తీశాడు. ఏటీఎం నుంచి డబ్బులు డ్రా అయినట్లు తెలియడంతో మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.