గుడ్ న్యూస్.. రైళ్లలో ATMలు.. ఎక్కడ కావాలంటే అక్కడ డ్రా చేస్కోవచ్చు..!

గుడ్ న్యూస్.. రైళ్లలో ATMలు.. ఎక్కడ కావాలంటే అక్కడ డ్రా చేస్కోవచ్చు..!

ఢిల్లీ: చేతిలో డబ్బుల్లేవ్.. యూపీఐ పనిచేయడం లేదు.. అసలే రైల్లో ఉన్నం..ఎలా..? ఆలోచిస్తున్నారా..? ఆ టెన్షన్ వద్దంటోంది ఇండియన్ రైల్వేస్. రైళ్లలో  ఏటీఎం సేవలను అందుబాటులోకి తేనుంది. సెంట్రల్‌ రైల్వే  తొలిసారిగా ముంబయి-మన్మాడ్‌ పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయోగాత్మకంగా ఏటీఎంను ఏర్పాటు చేశారు.  రోజూ నడిచే ఈ ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రైవేట్‌ బ్యాంక్‌కు చెందిన ఏటీఎంను ఏసీ చైర్‌కార్‌ కోచ్‌లో ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. త్వరలో పూర్తి స్థాయిలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు.

పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయోగాత్మకంగా దీనిని ఏర్పాటు చేసినట్లు సెంట్రల్‌ రైల్వే చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫిసర్‌ స్వప్నిల్‌ నీలా వెల్లడించారు. కోచ్‌లో గతంలో తాత్కాలిక ప్యాంట్రీగా ఉపయోగించిన స్థలంలో ఈ ఏటీఎంను ఏర్పాటు చేశారు. రైలు కదులుతున్నప్పుడు భద్రత పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికి దీనికి షట్టర్‌ డోర్‌ను కూడా అమర్చారు. ఇందుకు సంబంధించి కోచ్‌లో అవసరమైన మార్పులను మన్మాడ్‌ వర్క్‌షాప్‌లో చేపట్టినట్లు అధికారులు వివరించారు. పంచవటి ఎక్స్‌ప్రెస్‌ ముంబైలోని సీఎస్టీ నుంచి మన్మాడ్‌ జంక్షన్‌ వరకూ వెళ్తుంది.