మోర్తాడ్, వెలుగు : నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని పోచంపాడ్ చౌరస్తా నేషనల్ హైవే 44 పక్కన ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో చోరీ జరిగింది. వ్యాగన్ఆర్ సిల్వర్కలర్ కారులో వచ్చిన ఆగంతకులు షట్టర్‌ను ఐరన్ రాడ్లతో పైకి లేపి, గ్యాస్ కట్టర్‌తో ఏటీఎంను కట్ చేశారు. అంతకుముందే సీసీ కెమెరాలపై బ్లాక్కలర్ స్ర్పే చేశారు. తర్వాత ఏటీఎంలోని సుమారు రూ.10 లక్షల వరకు నగదు దోచుకెళ్లినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. ఏటీఎం ధ్వంసం చేస్తున్నప్పుడే సర్వే లైన్స్టీమ్ ద్వారా ఏటీఎం మెయింటెయిన్ చేసే రాజ్‌కుమార్‌కు సమాచారం వెళ్లింది.
దీంతో అతడు స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ యాదవ్ కు చెప్పాడు. పోలీసులు అక్కడికి చేరుకునేలోపే దుండగులు నగదుతో పరారయ్యారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ఆధారాలు సేకరించిందని ఎస్ఐ చెప్పారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠానే ఈ చోరీకి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ముఠా కోసం స్పెషల్టీమ్స్ఏర్పాటు చేసి గాలిస్తున్నామని అడిషనల్ కమిషనర్ జయరాం తెలిపారు.
ఘటనా స్థలాన్ని ఆర్మూర్ ఏసీపీ జగదీశ్‌చందర్, ఆర్మూర్ రూరల్ సీఐ గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు. ఏపీ 25 ఎల్9023 సిల్వర్ కలర్ వ్యాగన్ ఆర్ కారును నిందితులు ఉపయోగించారని తమకు అనుమానం ఉందని, ఎక్కడైనా కనిపిస్తే డయల్100కు కాల్ చేసి చెప్పాలని కోరారు.