భూమికి దగ్గరగా ఉన్న వాతావరణ పొర?

భూమిని ఆవరించి ఉన్న ఘన, ద్రవ, వాయు పదార్థాలతో కూడిన దట్టమైన పొరనే వాతావరణం అంటారు. భూ ఉపరితలం నుంచి 50 కి.మీ. ఎత్తులో 90శాతం వాతావరణ కేంద్రీకృతమైంది. అధిక బరువైన నైట్రోజన్​, ఆక్సిజన్​ వంటి వాయువులతో వాతావరణమంతా ఏర్పడటమే ఇందుకు కారణం. భూ ఉపరితలం నుంచి వాతావరణంలో ఎత్తుకు వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రతల్లో కలిగే మార్పుల ఆధారంగా వాతావరణాన్ని ట్రోపో, స్ట్రాటో, మీసో, ఐనో ఆవరణాలుగా విభజించారు. 

ట్రోపో ఆవరణం: భూమి ఉపరితలం నుంచి సగటున 13 కి.మీ.ల ఎత్తు వరకు విస్తరించి ఉన్న వాతావరణంలోని మొదటి పొరనే ట్రోపో ఆవరణం అంటారు. ఈ ఆవరణాన్ని టాస్సారిస్​ డీబార్డ్​ అనే శాస్త్రవేత్త రీజియన్​ ఆఫ్​ మిక్సింగ్​ అని పిలిచారు. ట్రోపో అంటే మార్పు అని అర్థం. ఇది భూమధ్య రేఖ వద్ద 18కి.మీ., ధ్రువాల వద్ద 8 కి.మీ.ల ఎత్తును కలిగి ఉంటుంది. ఈ ఆవరణంలో ప్రతి 165 మీ.ల ఎత్తుకు వెళ్లే కొద్దీ ఉష్ణగ్రత 1 డిగ్రీ చొప్పున తగ్గుతుంది. దీన్నే  సాధారణ ఉష్ణోగ్రత క్షీణతాక్రమం అంటారు. ఈ ప్రాంతంలోనే 99శాతం దుమ్ము, ధూళి కణాలు, నీటి ఆవిరి కేంద్రీకృతమై ఉన్నందున వాతావరణ పొరలన్నింటిలో ఇది అధిక సాంద్రతను కలిగి ఉంటుంది. ద్రవీభవనం జరగడం, మేఘాల నిర్మాణం, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం, అల్పపీడనాలు మొదలైన 75శాతం జీవక్రియలు ఈ ఆవరణంలో జరగడం మూలంగా ఈ ఆవరణాన్ని జీవావరణం అని కూడాఅంటారు. ఈ ఆవరణంలో జెట్​స్ట్రీమ్స్​ వల్ల వాతావరణంలో అనేక రకాల గందరగోళ పరిస్థితులు ఏర్పడటం వల్ల దీనిని గందరగోళ ఆవరణం/ సంక్షుబ్ది వాతావరణం అంటారు. 

స్ట్రాటో ఆవరణం: ట్రోపోపాస్​ నుంచి 50కి.మీ.ల ఎత్తువరకు గల వాతావరణంలోని రెండో పొరనే స్ట్రాటో ఆవరణం అంటారు. ఈ ఆవరణంలో ఎత్తుకు వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. దీని కారణంగా ఇక్కడి వాతావరణం ఎలాంటి అలజడులకు లోనుకాకుండా ప్రశాంతంగా ఉండటంతో విమానయానానికి అనుకూలంగా ఉంటుంది. ఈ ఆవరణంలో 25 కి.మీ. నుంచి 35 కి.మీ.ల ప్రాంతంలో ఓజోన్​ పొర కేంద్రీకృతమై ఉంటుంది. ఈ ఓజోన్​ పొర భూమి వైపు ప్రసరించే ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాలను నియంత్రిస్తుంది. క్లోరో ఫ్లోరో కార్బన్ల వల్ల ఓజోన్​ పొరకు రంధ్రాలు ఏర్పడుతున్నాయి. స్ట్రాటో ఆవరణానికి తొలి భారతీయుడు టి.ఎన్​.సురేష్​కుమార్​ చేరుకున్నారు. ఈయన 2014 ఆగస్టు 15న రష్యాలోని సోకోల్​ వైమానిక స్థావరం నుంచి మిగ్​ –29 నౌకలో ప్రయాణించాడు. 

మీసో ఆవరణం: స్ట్రాటో పాస్​ నుంచి 80 కి.మీ.ల వరకు గల వాతావరణంలోని మూడో పొరనే మీసో ఆవరణం అంటారు. ఈ ఆవరణంలో ఎత్తుకు వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత అధిక స్థాయిలో పతనమవుతుంది. దీని కారణంగా వాయు అణువుల్లో గల గతిశీలత లోపించి నిశ్చల స్థితిలో ఉన్నందున ఘర్షణ బలాలు జనిస్తాయి. ఈ ఆవరణంలోనే ఉల్కాపాతాలు సంభవిస్తాయి. ఈ ఆవరణ లక్షాణాలు అన్నీ ట్రోపో ఆవరణ లక్షణాల మాదిరిగా ఉండటంతో దీన్ని బాహ్యట్రోపో ఆవరణం అని అంటారు. 

ఐనో/ థర్మో ఆవరణం: మీసో పాస్​ నుంచి 400 కి.మీ.ల వరకు గల వాతావరణంలోని నాలుగో పొరనే ఐనో/ థర్మో ఆవరణం అంటారు. ఈ ఆవరణంలోని వాయువులు అయాన్ల రూపంలో ఉన్నందున వాటి మధ్య చర్యలు జరిగి శక్తి, ఉష్ణము విద్యుదయస్కాంత తరంగాల రూపంలో విడుదలవుతుంది. దీని కారణంగా రేడియో, దూరదర్శన్​ తరంగాలు భూమి మీదకు పరావర్తనం చెందడం వల్ల సమాచార వ్యవస్థ అధిక స్థాయిలో అభివృద్ధి చెందింది. కాబట్టి దీన్ని సమాచార వ్యవస్థ పొర అంటారు. వాయువులు అయాన్ల రూపంలో ఉంటాయి. అందుకే దీనిని ఐనో ఆవరణం అంటారు. ఉష్టోగ్రతలు గణనీయంగా పెరుగుతాయి. కాబట్టి దీన్ని థర్మో ఆవరణం అని కూడా అంటారు. ఈ ఆవరణంలోనే స్పేస్​ స్టేషన్​ను నిర్మించారు. ఈ ఆవరణంలోనే స్పేస్​ షటిల్స్​ తిరుగుతాయి. ఇది వాతావరణంలో తక్కువ సాంద్రత గల ఆవరణం. 

ఎక్సో ఆవరణం: ఐనోపాస్​కు పైన గల మిగిలిన ఆవరణాన్ని ఎక్సో ఆవరణం అంటారు. ఈ ఆవరణంలో పదార్థం ప్లాస్మా స్థితిలో ఉంటుంది. కృత్రిమ ఉపగ్రహాలను ప్రవేశ పెట్టే వాతావరణం(భూమి నుంచి 36,000 కి.మీ.ఎత్తులో). భూ వాతావరణం నుంచి 64000 కి.మీ.ల ఎత్తులో ఉన్న అయస్కాంత వికిరణ మేఖలను వ్యాన్​ అలెన్​ వికిరణ మేఖల అని అంటారు. వ్యాన్​ అలెన్​ వికిరణ మేఖల భూమి మీదకు ప్రసరించే సౌర పవనాలను నియంత్రించి భూమి మీద జీవ వైవిధ్యాన్ని కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తుంది. ట్రోపో, స్ట్రాటో, మీసో ఆవరణాలను కలిపి ఏకావరణం అంటారు. ఐనో, ఎక్సో ఆవరణాలను కలిపి విరుద్ధ ఆవరణం అంటారు.    

నైట్రోజన్​: భూమి చుట్టూ ఉన్న వాతావరణంలో అధిక శాతం గల వాయువు. దీనిని మొక్కలు పరోక్షంగా నైట్రేట్స్​ రూపంలో వినియోగించుకుంటాయి. ఇది లెగ్యుమినేసి కుటుంబానికి చెందిన మొక్కలకు ప్రాణప్రదమైన వాయువు. ఆక్సిజన్​ దహన ప్రక్రియను స్థిరీకరించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. 

ఆక్సిజన్​: నత్రజని తర్వాత భూ వాతావరణంలో ఎక్కువ గల వాయువు. ఇది జీవరాశులకు ప్రాణప్రదమైన వాయువు. ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాలు భూమిని చేరకుండా నియంత్రించే ఓజోన్​ పొరను ఏర్పరచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. 

కార్బన్​ డై ఆక్సైడ్​: భూమి వాతావరణంలో ఈ వాయువు 0.03శాతం ఉంది. మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహార పదార్థాలు ఉత్పత్తి చేసుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. గ్రీన్​హౌస్​ ఫలితానికి కారణమయ్యే వాయువు. దీన్నే బొగ్గుపులుసు వాయువు అని కూడా అంటారు. 

ఆర్గాన్: భూ వాతావరణంలో దీని శాతం 0.93%. భూవాతావరణం ఎక్కువగా ఉండే జడవాయువు. దీన్ని ఎలక్ట్రిక్​ బల్బుల్లో ఉపయోగిస్తారు. 

1. వాతావరణంలోని అత్యధిక పైభాగాన్ని ఏమని పిలుస్తారు? (4) 


1) ట్రోపోస్పియర్​    2) స్ట్రోటోస్పియర్​
3) ఐనోస్పియర్​    4) ఎక్సోస్పియర్​


2. వాతావరణంలో అత్యధికంగా ఉండే జడవాయువు? (2) 


1) నియాన్​        2) ఆర్గాన్​    
3) మోనాజటాన్​    4) ఏదీకాదు 


3. వాతావరణంలో ఓజోన్​పొర దేనివల్ల ఛిద్రమవుతోందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు?  (2) 


1) సల్ఫర్​ డై ఆక్సైడ్​             2) క్లోరోఫ్లోరోకార్బన్స్​
3) కార్బన్​ డై ఆక్సైడ్​           4) హైడ్రోజన్


4. వాతావరణంలోని ఏ పొర నుంచి రేడియో ప్రసరణ సాధ్యం? (1) 


1) అయనో ఆవరణం 2) మెసో ఆవరణం
3) స్ట్రాటో ఆవరణం     4) ట్రోపో ఆవరణం​


5. భూమికి దగ్గరగా ఉన్న వాతావరణ పొర? (3) 


1) ఎక్సోస్పియర్​     2) అయనోస్పియర్​
3) ట్రోపో స్పియర్​     4) స్ట్రోటో స్పియర్​


6. వాతావరణంలో అధికంగా గల జడవాయువు? (3)


1) He    2) Ne     3) Ar     4) Kr


7. జీవావరణం అని దేనిని పిలుస్తారు? (1)


1) ట్రోపో    2) స్ట్రాటో    
3) మీసో    4) ఐనో


8. ఓజోన్​ ఆవరణం అని దేనిని పిలుస్తారు? (2)


1) ట్రోపో    2) స్ట్రాటో    
3) మీసో    4) ఎక్సో


9. సిర్రస్​ మేఘాలు ఏ ఆవరణంలో విస్తరించి ఉన్నాయి? (3)  
1) ట్రోపో    2) స్ట్రాటో    
3) మీసో    4) ఎక్సో


10. స్పేస్​ స్టేషన్​ గల ఆవరణం? (3)


1) ట్రోపో    2) స్ట్రాటో    3) థర్మో       4) ఎక్సో