నల్లమలలో యురేనియం సర్వే

నల్లమలలో యురేనియం సర్వే
  •     నమూనాలు సేకరిస్తున్న అటమిక్​ ఎనర్జీ ఆఫీసర్లు
  •     ఆందోళనలో స్థానికులు
  •     మార్చి 5న ఫారెస్ట్​ ఆఫీస్​ముట్టడికి జేఏసీ నిర్ణయం

నాగర్​కర్నూల్, వెలుగు: నల్లమలలో యురేనియం నిక్షేపాల వెలికితీతకు ఎటువంటి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని అసెంబ్లీలో సీఎం ప్రకటించినా సర్వే మాత్రం ఆగడం లేదు. జనవరి మూడో వారంలో నాగర్​కర్నూల్​ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో పర్యటించిన అటమిక్​ మినరల్స్​ డైరెక్టరేట్ (​ఏఎండీ) టీం, ఫారెస్ట్‌‌‌‌ ఆఫీసర్లతో కలిసి చెట్లను లెక్కించారు. మార్కింగ్ ఇచ్చి మట్టి శాంపిల్స్‌‌‌‌ సేకరించారు. రాయలగండి ప్రాంతంలో సర్వే చేస్తున్న విషయం స్థానికులు గుర్తించారు. వచ్చినవాళ్లు యురేనియం కార్పొరేషన్‌‌‌‌ ఆఫ్​ ఇండియా సంస్థకు చెందినవారిగా అనుమానిస్తున్నారు. ఫారెస్ట్‌‌‌‌ ఆఫీసర్లు దగ్గరుండి చెట్లకు మార్కింగ్ ఇప్పించడం, మట్టి శాంపిల్స్‌‌‌‌ తీసుకోవడంపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. 

2 నెలల్లో 4 వేల బోర్లు..

రాజకీయ పార్టీలు, పర్యావరణవేత్తలు, ప్రజాసంఘాల పోరాటాలతో  దిగొచ్చిన  రాష్ట్ర ప్రభుత్వం 2019 సెప్టెంబర్​లో  నల్లమలలో యురేనియం నిక్షేపాల వెలికితీత, సర్వేకు పర్మిషన్‌‌‌‌ ఇచ్చేది లేదని అసెంబ్లీలో పేర్కొంది. అయితే ఈ ఏడాది జనవరిలో ఏఎండీ సైంటిస్టుల టీం రాయలగండి పరిసరాల్లో తవ్విన బోర్ల నుంచి నిక్షేపాలు సేకరించింది. రెండు మూడు రోజులపాటు సర్వే కొనసాగించారు. తర్వాత అటువంటిదేం లేదని బుకాయించారు. దీనిపై  నల్లమల యురేనియం వ్యతిరేక జేఏసీ మండిపడుతోంది. ఫారెస్టు ఆఫీసర్లు మొదటి నుంచి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని సంస్థ అధ్యక్షుడు నాసరయ్య ఆరోపించారు. ఏఎండీ శాస్త్రవేత్త  నిరంజన్ కుమార్ నల్లమల అడవుల్లో యురేనియం అన్వేషణ జరుగుతున్నదని అంగీకరించిన తర్వాత కూడా ఫారెస్ట్​ ఆఫీసర్లు దాచాలని చూడటం దుర్మార్గమన్నారు. రెండు నెలల్లో యురేనియం సంస్థ దాదాపు 4000 బోరు పాయింట్స్​ పెట్టడాన్నిబట్టి నిక్షేపాల అన్వేషణ కొనసాగుతున్నదన్న విషయం బట్టబయలైందన్నారు. యురేనియం నిక్షేపాల కోసం బోరు బండ్లు రావడానికి అడవిలో రోడ్లు వేయాలని చూస్తున్నారని, ఇందుకోసం ఎన్ని చెట్లు కొట్టేయాలో నంబర్లు వేశారని అన్నారు. ఫారెస్ట్​ ఆఫీసర్లు నల్లమలలో కాలు పెట్టకుండా చూడాలని చెంచులకు పిలుపునిచ్చారు. అయితే లంబాపూర్, పెద్దగట్టు, దేవరకొండ పరిధిలోని చిత్రియాల్​లో యురేనియం నిక్షేపాలు గుర్తించినట్లు ప్రకటించినా.. ఇక్కడ కేవలం 0.65 శాతం మాత్రమే యురేనియం దొరికే అవకాశాలున్నాయని, దీని కోసం నల్లమల లేదా ఇతర ప్రాంతాల్లో గని ఏర్పాటు చేసే పరిస్థితి లేదని ఏఎండీ అధికారులు చెబుతున్నారు.

యురేనియం వ్యతిరేక ఉద్యమానికి రెడీ

అమ్రాబాద్, పదర మండలాల్లో సాగులో ఉన్న దాదాపు 1000  ఎకరాల లావుని పట్టా భూమిని  ఫారెస్ట్​ శాఖకు అప్పగించడంలో రహస్యం ఏమిటో రెవెన్యూ అధికారులు వెల్లడించాలని స్థానికులు డిమాండ్​ చేస్తునారు. ఈ  భూముల్లోనే  బోర్లు వేసి మట్టి నమూనాలు సేకరించారని, ఇప్పుడు ఏకంగా భూమిని బదలాయించేందుకు రంగం సిద్ధం చేశారని ఆరోపిస్తున్నారు. 2012 నుంచి నల్లమల అడవులలో యురేనియం సర్వే జరుగుతోందని, స్థానిక ప్రజల పోరాటాలను నీరుగార్చేందుకు అసెంబ్లీ తీర్మానమంటూ  డ్రామా ఆడారని ఆరోపిస్తున్నారు. యురేనియం సర్వే జరిగితే ముందుండి పోరాడతామన్న నాయకులు, పార్టీలు పత్తా లేకుండా పోయాయంటున్నారు. ‘మన నల్లమల అడవులను మనమే కాపాడుకుందాం’ అనే నినాదంతో స్థానికులు, చెంచులు యురేనియం వ్యతిరేక ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ప్రజలు సాగు చేసుకుంటున్న1000  ఎకరాల లావుని పట్టా భూములను తిరిగి వారికే ఇవ్వాలని డిమాండ్ ​చేస్తున్నారు. ఇందుకోసం మార్చి5న ఫారెస్ట్ ఆఫీసు ముందు ధర్నా నిర్వహిస్తామని యురేనియం వ్యతిరేక జేఏసీ ప్రకటించింది. నల్లమలలో భూములు కోల్పోతున్న బాధిత రైతు కుటుంబాలు ధర్నాలో పాల్గొనేలా ప్రతి పల్లె, పెంటలో తిరుగుతామని నాసరయ్య ప్రకటించారు.