గుడిహత్నూర్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు ఆదిలాబాద్ ఏఎస్పీ సురేందర్‌రావు మీడియాకు తెలిపారు. నిందితుడు చట్ల పోశెట్టి (23)ని అదుపులోకి తీసుకుని అట్రాసిటీ, పోక్సో కేసులు నమోదు చేయడమే కాకుండా పోలీసులపై దాడి, విధులకు ఆటంకం కలిగించిన12 మందిని గుర్తించి హత్యాయత్నం కేసు పెట్టినట్టు వివరించారు.
శనివారం రాత్రి గుడిహత్నూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటన తెలిసిందే. నిందితుడు పోశెట్టిని అదుపులోకి తీసుకునేందుకు వెళ్లిన పోలీసులపై కొందరు దాడి చేయడమే కాకుండా వాహనాలను ధ్వంసం చేశారు. నిందితుడి ఇంటికి నిప్పుపెట్టారు. ఆదివారం పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదని ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్ హెచ్చరించారు.
అత్యాచార నిందితుడి ఇంటిని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. నార్నూర్ సీఐ రహీంపాషా, ఎస్ఐలు మహేందర్, ఎల్ ప్రవీణ్, సిబ్బంది ఉన్నారు. అదేవిధంగా బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మాంగ్ కులస్తులు స్థానిక సీఐ భీమేశ్కు వినతిపత్రం అందజేశారు.