కరీంనగర్ టౌన్/రాజన్న సిరిసిల్ల, వెలుగు: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో పోలీసులు వెంటనే స్పందించి, బాధితులకు అండగా నిలవాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్ ఆదేశించారు. బాధితులకు అండగా నిలవాలని సూచించారు. మంగళవారం కరీంనగర్, రాజన్న సిరిసిల్లకలెక్టరేట్లలో రివ్యూ నిర్వహించారు. కలెక్టర్లు పమేలాసత్పతి, సందీప్ కుమార్ ఝా, కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి, సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లా ఆఫీసర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ 2018లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను వెంటనే నమోదు చేసేలా ఒక చట్టాన్ని తీసుకొచ్చారని చెప్పారు. జిల్లాలోని బ్యాక్ లాగ్ పోస్టులు, ప్రమోషన్లకు సంబంధించిన వివరాలు 15 రోజుల్లో అందించాలని ఆదేశించారు. అసైన్డ్ భూములకు చట్టబద్ధత కల్పించి పాస్ పుస్తకాలు అందించాలని, లైంగిక దాడులు, హత్యకు గురైన బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలని, పరిహారం అందించాలని ఆదేశించారు.
గోడు వెల్లబోసుకున్న నేరెళ్ల బాధితులు
ఎస్సీ జాతీయ కమిషన్ సభ్యుడు రాంచందర్ ను నేరెళ్ల బాధితులు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఎనిమిదేండ్ల కింద ఇసుక ట్రాక్టర్ దగ్ధం కేసులో నేరెళ్ల బాధితులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. తమకు న్యాయం చేయాలని, తమపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులను విధుల నుంచి తప్పించాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఆయన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.