హైదరాబాద్ లోని ఎస్సార్ నగర్ లో దారుణం జరిగింది. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమ హాస్టల్లో హత్య ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే టీచర్ పై కత్తితో దాడి చేసి హత్య చేశాడో దుండగుడు. ఎస్సార్ నగర్ లో హెయిర్ కట్ షాప్ లో పనిచేసే బార్బర్ గణేష్, టీచర్ వెంకటరమణ అదే ఏరియాలోని హనుమ హాస్టల్లో ఒకే షేరింగ్ రూమ్ లో నివాసం ఉంటున్నారు.
ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ వెంకటరమణ పై గణేష్ కటింగ్ షాప్ లో ఉపయోగించే కత్తితో దాడి చేశాడు. వెంకటరమణ పడుకుంటున్న సమయంలో తనతో తెచ్చుకున్న కత్తితో గణేష్ దాడి చేశాడు. విచక్షణారహితంగా కత్తితో దాడి చేయడంతో వెంకటరమణ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు వెంకటరమణ కర్నూల్ జిల్లా ఆలమూరు గ్రామ నివాసిగా గుర్తించారు పోలీసులు. కాగా ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.