
జగిత్యాల, వెలుగు: భర్త మీద కోపం, చిన్నారి అల్లరి చేస్తున్నాడన్న కారణంతో ఓ మహిళ తన మూడేండ్ల కొడుకును చితకబాదింది. విపరీతంగా కొట్టడం, కింద పడేసి తన్నడంతో బాలుడి ఏడుపు విన్న స్థానికులు చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీకి ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తులసినగర్‌కు చెందిన ఆంజనేయులుకు గతంలో వివాహం జరుగగా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మూడున్నరేండ్ల కింద రాయికల్‌కు చెందిన రమను రెండో పెండ్లి చేసుకున్నాడు.
రమ ఆరు నెలల గర్భంతో ఉన్న టైంలోనే ఆంజనేయులు ఉపాధి కోసమని దుబాయ్ వెళ్లాడు. మూడు నెలల కింద ఇండియాకు వచ్చిన ఆంజనేయులు కొన్ని రోజులు ఉండి తిరిగి దుబాయ్ వెళ్లిపోయాడు. అయితే ఆంజనేయులు తన మొదటి భార్యతో తిరిగి సంబంధం కొనసాగిస్తున్నాడని రమ అనుమానం పెట్టుకుంది. ఈ క్రమంలోనే రమ, ఆంజనేయులు ప్రతి రోజు ఫోన్‌లో గొడవ పడుతున్నారు.
భర్తతో గొడవ, తన మూడేండ్ల కొడుకు అల్లరి, తనకు సహకరించే వారు ఎవరూ లేకపోవడంతో ఆగ్రహానికి గురైన రమ కొడుకును విపరీతంగా కొట్టడంతో పాటు, కింద పడేసి కాలుతో తన్నేది. ప్రతి రోజు కొడుకును కొడుతుండడంతో సోమవారం కాలనీవాసులు వీడియో తీసి చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీకి ఫిర్యాదు చేశారు. డీసీపీవో హరీశ్ రమకు కౌన్సిలింగ్ ఇచ్చి, చిన్నారిని అమ్మమ్మ, తాతయ్యకు అప్పగించారు.