నిజామాబాద్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ విధుల్లో ఉన్న వీ6 జిల్లా ప్రతినిధి రజినీకాంత్ పట్ల నగర ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి శుక్రవారం అత్యుత్సాహం ప్రదర్శించారు. దురుసుగా ప్రవర్తించి పోలీస్ పెత్తనం చూపారు. బీజేపీ అభ్యర్థి అర్వింద్ నామినేషన్ వేయడానికి వచ్చిన సందర్భంలో ఆయన వెంట వచ్చిన పసుపు రైతులతో మీడియా పాయింట్ వద్ద రజినీకాంత్ మాట్లాడుతూ.. వారి కామెంట్స్ రికార్డు చేయిస్తుండగా ఏసీపీ అసహనం ప్రదర్శించారు. పరుషపదాలతో అగౌరవపర్చారు.
ఆఫీసర్లు ఎంపిక చేసిన మీడియా పాయింట్ వద్దే విధులు నిర్వహిస్తుంటే అభ్యంతరం ఏమిటని ప్రశ్నించగా మరింతగా రెచ్చిపోయారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని బెదిరించారు. ఈ విషయాన్ని రజినీకాంత్ తోటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో కలిసి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా ఆయన లేకపోవడంతో ఏవో ప్రశాంత్ కు ఫిర్యాదు చేశారు. ఏసీపీ రాజా వెంకట్ రెడ్డిపై యాక్షన్ తీసుకోవాలని కోరారు.