
చొప్పదండి, వెలుగు: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్ సోషల్ వెల్ఫేర్ సైనిక్ స్కూల్లో గురువారం సాయంత్రం టెన్త్, ఇంటర్ స్టూడెంట్ల మధ్య గొడవ జరిగింది. టెన్త్ స్టూడెంట్లను ఇంటర్ విద్యార్థులు చితకబాదారు. బాధిత స్టూడెంట్స్, పేరెంట్స్ తెలిపిన వివరాల ప్రకారం.. టెన్త్, ఇంటర్ స్టూడెంట్ల మధ్య గొడవ జరిగింది. ఐదుగురు టెన్త్ స్టూడెంట్లను కొందరు ఇంటర్ విద్యార్థులు చితకబాదారు.
ఈ విషయాన్ని నైట్ స్టే టీచర్స్‌కు, పేరెంట్స్‌కు బాధిత స్టూడెంట్లు తెలిపారు. స్టూడెంట్లకు గాయాలు కావడంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో హాస్పిటల్‌కు తరలించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. శుక్రవారం బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్‌కు చేరుకొని ఆందోళనకు దిగారు. ఎస్సై అనూష సైనిక్ స్కూల్‌కు చేరుకొని దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తానని ప్రిన్సిపాల్ హామీ లెటర్ రాసి ఇవ్వడంతో ఆందోళన విరమించారు.