- మృతదేహంతో కుటుంబసభ్యుల ఆందోళన
- సూర్యాపేట జిల్లా తొండ గ్రామంలో ఘటన
తుంగతుర్తి , వెలుగు : సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల పరిధి లోని తొండ గ్రామంలో ఓ యువకుడిపై గ్రామానికే చెందిన యువకులు దాడి చేయగా నొప్పులు, అవమానభారం భరించలేక గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. రూపని సతీశ్ (29) హైదరాబాద్‌లో ప్రైవేట్ జాబ్ చేస్తుంటాడు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు భార్య, పిల్లలతో కలిసి గ్రామానికి వచ్చాడు. కుటుంబసభ్యులతో కలిసి అదే రోజు హైదరాబాద్ వస్తుండగా దారి కాచిన ఎనిమిది మంది యువకులు సతీశ్‌పై దాడి చేసి ఇష్టమున్నట్టు కొట్టారు. అయినా అదే రోజు సతీశ్ భార్యాపిల్లలను తీసుకుని హైదరాబాద్ వెళ్లిపోయాడు. ఇంటర్నల్‌గా దెబ్బలు తాకడంతో నొప్పులు భరించలేకపోయాడు. అలాగే అవమానం భారంతో గడ్డి మందు తాగాడు. అక్కడే ఓ దవాఖానకు తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ బుధవారం చనిపోయాడు.
దీంతో గురువారం అతడి మృతదేహాన్ని తొండ గ్రామానికి తీసుకువచ్చి దాడికి పాల్పడిన ప్రధాన నిందితుడి ఇంటి ముందు వేసిన కుటుంబసభ్యులు ఆందోళన చేశారు. ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు వచ్చి నచ్చజెప్పారు. దీంతో వారు మృతదేహాన్ని తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఎస్ఐ ప్రసాద్మాట్లాడుతూ ఘటనపై హైదరాబాద్‌లో కేసు నమోదైందని తెలిపారు. సతీశ్‌కు గతంలో ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉండేదని, ఆ విషయంలో పంచాయతీ నిర్వహించగా రూ.12 లక్షలు దండుగ కూడా కట్టినట్టు సమాచారం. అన్నింటికీ దూరంగా హైదరాబాద్‌లో ఉంటుండగా, మళ్లీ సదరు మహిళతో కాంటాక్ట్‌లో ఉన్నావని ఆరోపిస్తూ దాడి చేసినట్టు తెలుస్తోంది.