ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ప్రజావాణికి అర్జీల వెల్లువ 

మహబూబాబాద్, కాశీబుగ్గ(కార్పొరేషన్), జనగామ అర్బన్​, ఏటూరునాగారం, వెలుగు:  ప్రజావాణిలో వివిధ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లు సంబంధిత ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం గ్రేటర్​వరంగల్​బల్దియా, జనగామ, మహబూబాబాద్, ఏటూరునాగారం ఐటీడీఏల్లో ఉన్నతాధికారులు అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. జనగామ కలెక్టరేట్​లో  నిర్వహించిన ప్రజావాణిలో 54 అర్జీలు వచ్చినట్లు కలెక్టర్​సీహెచ్ శివలింగయ్య తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్​కలెక్టర్​ అబ్దుల్​ హామీద్​, జడ్పీ సీఈవో విజయలక్ష్మి, డీఆర్​డీఏ పీడీ రాంరెడ్డి, పాల్గొన్నారు.  గ్రేటర్​ బల్దియాలో అర్జీదారుల నుంచి 60 అర్జీలు స్వీకరించినట్లు కమిషనర్​ప్రావీణ్య తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్​కమిషనర్​ రవీందర్, ఎస్ఈ ప్రవీణ్​చంద్ర, సీహెచ్​ఓ శ్రీనివాస రావు పాల్గొన్నారు.  మహబూబాబాద్​కలెక్టరేట్​లో ప్రజావాణికి  83 అర్జీలు వచ్చాయని కలెక్టర్ శశాంక ​తెలిపారు. అనంతరం జిల్లా ఆఫీసర్లతో కలెక్టర్ ​మీటింగ్ ​నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆఫీసర్లను ఆదేశించారు. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలకు ఓడీఎఫ్ ప్లస్ అవార్డు రావడంపై అడిషనల్​ కలెక్టర్ అభిలాష అభినవ్ ను, మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్​ అభినందించారు.ఏటూరునాగారం ఐటీడీఏలో నిర్వహించిన ప్రజావాణిలో 21 మంది గిరిజనుల నుంచి పీవో అంకిత్​వినతులు స్వీకరించారు. 

ట్రై సిటీలో ట్రాఫికర్​

బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా వాహనాల రాకపోకలు పెరగడంతో ట్రై సిటీలో ట్రాఫిక్​ కష్టాలు రెట్టింపయ్యాయి.  ముఖ్యంగా హనుమకొండ బస్టాండ్​ జంక్షన్ లో తరుచూ ట్రాఫిక్​జామ్​ అవుతోంది. బస్టాండ్​లోకి వచ్చీపోయే బస్సులు పెద్దసంఖ్యలో బారులు తీరుతున్నాయి. వీటికి ఆటోలు, కార్లు, బైకులు తోడై ఈ ప్రాంతం ట్రాఫిక్​ గజిబిజీగా మారుతోంది. ఈ ఏరియాలో ట్రాఫిక్​ సిగ్నల్స్​ లేకపోవడం, ట్రాఫిక్​ పోలీసులను ఏర్పాటుచేయకపోవడం వల్లే వెహికిల్స్​ అడ్డదిడ్డంగా వచ్చి  ఒక్కోసారి అరగంట దాకా ట్రాఫిక్​స్తంభిస్తోందని సిటీ జనం అంటున్నారు.  (- వెలుగు ఫొటోగ్రాఫర్, వరంగల్​)

భూకబ్జాలకు సూత్రదారులు టీఆర్ఎస్​ లీడర్లే
 అధికార పార్టీ లీడర్ల ఒత్తిళ్లకు ఆఫీసర్లు లొంగొద్దు 
 బీజేపీ స్టేట్​ లీడర్​, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్​రెడ్డి

నర్సంపేట, వెలుగు: నర్సంపేట టౌన్​లో వెలుగు చూస్తున్న భూకబ్జాలు..సెటిల్​మెంట్​ దందాల్లో సూత్రధారులు, పాత్రధారులంతా టీఆర్ఎస్​ లీడర్లేనని బీజేపీ స్టేట్​ లీడర్, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్​రెడ్డి అన్నారు. కబ్జాపై అధికార పార్టీ లీడర్ల ఒత్తిళ్లకు ఆఫీసర్లు లొంగకుండా నిజాయతీగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాలని, జాలుబంధం కాలువకు బౌండరీలను ఫిక్స్​ చేయాలని డిమాండ్​ చేస్తూ సోమవారం నర్సంపేటలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ నిరసన దీక్ష చేపట్టారు. ఈసందర్భంగా రేవూరి మాట్లాడుతూ మూడు నెలల్లో టౌన్​లోని ప్రభుత్వ భూముల చుట్టూ బౌండరీలు ఫిక్స్​ చేయకపోతే బీజేపీ ఆధ్వర్యంలో తామే ఫిక్స్​ చేస్తామని స్పష్టం చేశారు. కొంతమంది ఐఏఎస్​, ఐపీఎస్​ ఆఫీసర్లు అధికార పార్టీ లీడర్లను ప్రసన్నం చేసుకునే క్రమంలో కాళ్లు మొక్కి పదవులు తెచ్చుకోవడం చూస్తున్నామని, ఇందుకు సిద్దిపేట కలెక్టర్, సూర్యాపేట ఎస్పీలు తీరే నిదర్శనమన్నారు. జాలుబంధం కాలువను పరిరక్షించేందుకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​రెడ్డి ఇరిగేషన్​ ఆఫీసర్లకు ఆదేశాలివ్వాలని డిమాండ్​ చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను నర్సంపేట నుంచి పోటీ చేయడం ఖాయమని స్పష్టం చేశారు. దీక్షలో లీడర్లు రాణాప్రతాప్​రెడ్డి, అజయ్​కుమార్​, ప్రతాప్​, మాజీ సర్పంచ్​ రజనీభారతి, శ్రీనివాస్​, రాజు, 
సతీశ్​పాల్గొన్నారు. 

కాలువ కబ్జాపై.. కలెక్టర్​కు కాంగ్రెస్​ ఫిర్యాదు 

నర్సంపేట, వెలుగు: నర్సంపేట టౌన్​లో జాలుబంధం కాలువను కబ్జా నుంచి రక్షించాలని కాంగ్రెస్​ లీడర్లు వరంగల్​ కలెక్టర్​ గోపిని కోరారు. ఈమేరకు సోమవారం కలెక్టర్​ను కలిసి ఫిర్యాదు చేశారు. జాలుబంధం కాలువ ఎలా కబ్జా అవుతుందో ఆయనకు వివరించారు. కాలువను రక్షించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని కలెక్టర్​ హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్​ పార్టీ లీడర్లు వెల్లడించారు. పీసీసీ మెంబర్​ రామానంద్​, పార్టీ నియోజకవర్గ కన్వీనర్​ రవీందర్​రావు, టౌన్​ ప్రసిడెంట్​ రాజేందర్​, మున్సిపల్​ ఫ్లోర్​ లీడర్​ సాంబయ్య, ఓబీసీ సెల్​ జిల్లా ప్రెసిడెంట్​తిరుపతి, కౌన్సిలర్లు విజయ్ కుమార్, వినోద పాల్గొన్నారు. 

టీచర్లకు అండగా ఉంటాం
 బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ

హసన్​పర్తి, వెలుగు: టీచర్లకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ స్పష్టం చేశారు. సోమవారం ఓల్డ్​ పెన్షన్​ స్కీంను అమలు చేయాలని కోరుతూ ప్రభుత్వ టీచర్స్​క్రికెట్​టోర్నమెంట్​ నిర్వహించి వినూత్న నిరసన చేపట్టారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆరు జిల్లాల నుంచి ఆరు జట్లు పాల్గొన్నాయి. టోర్నమెంట్​ను రావు పద్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓపీఎస్​ అమలు విషయాన్ని బీజేపీ స్టేట్​ ప్రెసిడెంట్​ బండి సంజయ్​ దృష్టికి తీసుకెళ్తానని, టీచర్లకు అండగా ఉండేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీసీ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు చిర్ర రాజు గౌడ్, నాయకులు కుమార్ గౌడ్, బీసీ విద్యార్థి సంఘం కేయూ ఇన్​ఛార్జి నాగరాజు పాల్గొన్నారు.

రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు బలోపేతం కావాలి

 చిట్యాల, వెలుగు:  రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు బలోపేతం కావాలని జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ విజయభాస్కర్ అన్నారు. ఎస్ఎఫ్ఏసీ సహకారంతో ఏఎఫ్​సీ ఇండియా ఆధ్వర్యంలో సోమవారం చిట్యాల మండలం జూకల్ రైతు వేదికలో రైతులకు, అగ్రికల్చర్ ఆఫీసర్లకు, సిబ్బందికి సీబీబీవోలకు ఈక్విటీ గ్రాంట్ , క్రెడిట్ గ్యారంటీ స్కీమ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ తిరుపతి, ఆఫీసర్లు రఘుపతి, సదానందం, అవినాశ్, ప్రసన్న, నాగబ్రహ్మచారి, శ్రీనివాసరాజు పాల్గొన్నారు.

రైతు సేవలో ముందున్నాం

ఎల్కతుర్తి, వెలుగు: విశాల సహకార సంఘం ద్వారా రైతులకు విస్తృత సేవలు అందిస్తున్నామని సొసైటీ చైర్మన్​ శ్రీపతి రవీందర్ గౌడ్ తెలిపారు.  హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని సొసైటీ ఆవరణలో 68వ సర్వసభ్య సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రవీందర్​గౌడ్​మాట్లాడుతూ బ్లాక్ లిస్ట్ లో ఉన్న సంఘాన్ని ఎమ్మెల్యే సహకారంతో లాభాల బాటకు తెచ్చామన్నారు. సమావేశంలో వైస్ చైర్మన్ శేషగిరి, డైరెక్టర్లు కె. శ్రీనివాస్​, ఐలయ్య, సంధ్య, ఎం.సమ్మయ్య, బి.రాజిరెడ్డి, ఎన్​ కృష్ణమూర్తి శర్మ, పోశయ్య, సీఈవో తిరుపతి, సిబ్బంది పాల్గొన్నారు. 


క్రీడలతో మానసికోల్లాసం

చిట్యాల, వెలుగు: క్రీడలతో ఫిట్​నెస్ తో పాటు మానసికోల్లాసం కలుగుతోందని ఎస్సై కృష్ణ ప్రసాద్ అన్నారు. చిట్యాల మండల కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన దోస్త్ వాటీబాల్ పోటీలను సోమవారం ఎస్సై ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని, వారితో కాసేపు వాలీబాల్ ఆడారు. 

శానిటేషన్ సిబ్బందిపై మాజీ కార్పొరేటర్ బూతుపురాణం 

వరంగల్​సిటీ, వెలుగు: ఖిలా వరంగల్ కు చెందిన ఓ మాజీ కార్పొరేటర్ శానిటేషన్ సిబ్బందిపై బండ బూతులతో బెదిరింపులకు దిగాడు. లైటింగ్ ఏర్పాటు చేయలేదని, బతుకమ్మ ఆడే ప్రాంతంలో శుభ్రం చేయలేదనే కారణాలను సాకుగా చూపి శానిటేషన్ సిబ్బందికి ఫోన్ చేసి బూతులు తిట్టడంతో సోమవారం సోషల్​ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై ఇప్పటివరకు సదరు మాజీ కార్పొరేటర్ పై ఎలాంటి పోలీసు కేసు నమోదు కాకపోవడం గమనార్హం. 

గంజాయి గ్యాంగ్​ అరెస్ట్​

వరంగల్ క్రైం, వెలుగు: గంజాయి దందా చేస్తున్న ఐదుగురు సభ్యుల గ్యాంగ్​లో నలుగురిని వరంగల్ టాస్క్​ ఫోర్స్​ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.40 వేల విలువైన 2 కేజీల గంజాయి, ఐదు స్మార్ట్​ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్​ఫోర్స్​ ఏడీసీపీ వైభవ్​ గైక్వాడ్​ వివరాల ప్రకారం.. ఎల్లాపూర్​ సమీపంలోని ఓ ఇంజినీరింగ్​కాలేజీలో చదువుతున్న గడ్డం విక్రమ్​, రాజమండ్రికి చెందిన గనగాల శ్యామ్​, సాయిదుర్గాప్రసాద్​, హనుమకొండ కాపువాడకు చెందిన మల్కం ప్రవీణ్​ లు కలిసి భీమారం ఓ రూమ్​ లో రెంటుకు ఉంటున్నారు. వారికి గంజాయి అలవాటు ఉండటంతో వైజాగ్​కు చెందిన సాత్విక్​ అనే యువకుడి నుంచి సరకు తెప్పించుకునేవారు. వారు తాగడంతో పాటు ఇతరులకూ అమ్మేవారు. ఈ క్రమంలో టాస్క్​ ఫోర్స్​ పోలీసులకు సమాచారం అందగా సోమవారం వారిని పట్టుకున్నారు. 

ముగిసిన నర్సయ్య సార్‍ అంత్యక్రియలు

వరంగల్‍, వెలుగు: ప్రముఖ విద్యావేత్త, ఏబీవీపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పూర్వ అధ్యక్షుడు గుజ్జుల నర్సయ్య (81) అంత్యక్రియలు సోమవారం హనుమకొండలో ముగిశాయి. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మండెలగూడెం  గ్రామానికి చెందిన నర్సయ్య.. ఆర్‍ఎస్‍ఎస్‍, ఏబీవీపీలో తనదైన సేవలతో వేలాది స్టూడెంట్లు, అభిమానులను సంపాదించుకున్నారు. అనారోగ్యంతో  శనివారం హనుమకొండ హంటర్‍రోడ్‍లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు.  సోమవారం ఉదయం 11 గంటలకు అంతిమయాత్ర మొదలైంది. యాత్రలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆర్‍ఎస్‍ఎస్‍ ప్రముఖ్‍లు, ఏబీవీపీ లీడర్లు, స్టూడెంట్లు, వివిధ పార్టీల నేతలు, అభిమానులు పాల్గొన్నారు. హంటర్‍రోడ్‍, అదాలత్‍, కాళోజీ సెంటర్‍, ఏకశిల పార్క్, బాలసముద్రం మీదుగా ఏషియాన్‍ మాల్‍ వెనకాల ఉన్న ఏబీవీపీ ఆఫీస్‍కు తరలించి నివాళులర్పించారు. అనంతరం యాత్ర హనుమకొండ బస్టాండ్‍, కేడీసీ కాలేజీ, హన్మకొండ చౌరస్తా శివశక్తి స్థల్‍ , మచిలీ బజార్‍ మీదుగా పద్మాక్షి ఆలయం దగ్గర్లోని శివముక్తిధాం చేరుకుంది. సాయంత్రం 4గం.లకు అంత్యక్రియలు నిర్వహించగా నర్సయ్య పెద్ద కుమారుడు గుజ్జుల రఘురాం తండ్రి చితికి నిప్పంటించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు, స్టేషన్‍ ఘన్‍పూర్‍ ఎమ్మెల్యే రాజయ్య, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఎస్‍ఆర్‍ కాలేజీల అధినేత వరదారెడ్డి.. నర్సయ్య పార్థివదేహానికి నివాళులు అర్పించారు. వనవాసీ కళ్యాణ పరిషత్‍ అఖిల భారత నాయకులు రామ చంద్రయ్య, వరంగల్‍ విభాగ్‍ సంఘచాలక్‍ సంజీవ, ఆర్‍ఎస్‍ఎస్‍ నేతలు చంద్రశేఖర్‍, తిరుమల్‍, విగ్నేష్‍, మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు, శ్రీధర్‍, శ్రీరాములు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్‍రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, రావు అమరేందర్‍రెడ్డి, ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్‍ పాల్గొన్నారు.

గిట్టుబాటు ధరకు కృషి చేయాలి

పర్వతగిరి, వెలుగు: పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా కాటన్​ప్రొక్యూర్​మెంట్​కమిటీ పనిచేయాలని వరంగల్​కలెక్టర్​ గోపి అన్నారు. వరంగల్​ జిల్లా కలెక్టరేట్​లో  సోమవారం 2022–-23 గాను వానాకాలం  కాటన్ ప్రొకూర్మెంట్ కమిటీ మీటింగ్  జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ  జిల్లాలో మొత్తం 28 కాటన్ మిల్లులు ఉన్నాయని,  వానాకాలం సీజన్ లో ప్రొక్యూర్​మెంట్​సెంటర్ల నిర్వహణలో 10 మంది సభ్యులతో కూడిన జిల్లా స్థాయి కమిటీ  ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ కనీస మద్దతు ధర మొదటి రకం ధర రూ. 6380, రెండో రకం ధర రూ. 6,080 గా నిర్ణయించినట్లు చెప్పారు. 

అక్టోబర్ 1న సీఎం కేసీఆర్ రాక

ఆత్మకూరు (దామెర) వెలుగు: హనుమకొండ జిల్లా దామెర మండలంలోని ప్రతిమ క్యాన్సర్ హాస్పిటల్​ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ ​రానున్నారు.  అక్టోబర్ 1న ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం వరంగల్ ఆర్డీవో మహేందర్ , పోలీసులు హెలీపాడ్, వీఐపీ పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించారు.

మహబూబాబాద్​లో 8 హాస్పిటళ్లకు నోటీసులు

మహబూబాబాద్​ అర్బన్​, వెలుగు: నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రైవేట్​ హాస్పిటళ్లలో సోమవారం తనిఖీలు చేసినట్లు డీఎంహెచ్​వో హరీశ్​రాజ్​ తెలిపారు. జిల్లాలో 8 హాస్పిటళ్లకు షోకాజ్​ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. మహబూబాబాద్​, డోర్నకల్, తొర్రూర్, గార్ల, గూడురుల్లో రిజిస్ట్రేషన్​ లేని, రెన్యూవల్​చేసుకోని, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు గుర్తించామని 
డీఎంహెచ్​వో చెప్పారు. 

ముగిసిన బియాబాని దర్గా ఉర్సు

కాజీపేట, వెలుగు: కాజీపేటలోని బియాబాని దర్గా ఉర్సు ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. చివరి రోజైన సోమవారం దర్గా పీఠాధిపతి ఖుస్రూ పాషా, ఉప పీఠాధిపతి భక్తియార్ బాబా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ముస్లిం మతపెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసి ఉత్సవాలు ముగిసినట్లు ప్రకటించారు. చివరిరోజు బదావా కార్యక్రమంలో ముస్లిం పకీర్లు ఇనుప చువ్వలను నాలుక, చేతి, శరీర భాగాలలో గుచ్చుకున్న  విన్యాసాలు చేశారు. ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేసిన జిల్లా యంత్రాంగానికి దర్గా పీఠాదిపతి కృతజ్ణతలు తెలిపారు. 


 బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ పై దాడి 
 దెబ్బకుదెబ్బ తీస్తామంటూ ప్రదీప్ రావు వార్నింగ్ 

వరంగల్​సిటీ, వెలుగు: అధికార పార్టీ అండతో కొంతమంది టీఆర్ఎస్ గుండాలు బీజేపీ శ్రేణులపై దాడులకు పాల్పడుతున్నారని, అలాంటి వారిపై దెబ్బకుదెబ్బ తీస్తామని బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఘాటుగా హెచ్చరించారు. సోమవారం ఖిల వరంగల్ లో బతుకమ్మ సెంటర్ వద్ద టీఆర్ఎస్​ మాజీ కార్పొరేటర్ దామోదర్ యాదవ్ అనుచర వర్గంతో బీజేపీ తూర్పు నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ ఇనుముల అరుణ్ పై దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఎర్రబెల్లి ప్రదీప్ రావు బాధితుడిని పరామర్శించి అనంతరం బాధితులతో పాటు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. మాజీ కార్పొరేటర్ పై ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ పాల్గొన్నారు. 

మావోయిస్టులకు ప్రజలు సహకరించొద్దు

మొగుళ్లపల్లి,వెలుగు:  మావోయిస్టులకు ప్రజలెవరూ సహకరించొద్దని ఎస్ఐ శ్రీధర్​సూచించారు. సోమవారం మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని ఎంజేపీ స్కూల్లో జిల్లా ఎస్పీ సూచన మేరకు భూపాలపల్లి డీఎస్పీ, చిట్యాల సీఐ పర్యవేక్షణలో మండలంలోని స్టూడెంట్స్, యువకులకు పోలీస్ దోస్త్ కార్యక్రమంలో భాగంగా వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.