బీఆర్ఎస్ యూత్ లీడర్ పై దాడి

మంచిర్యాల, వెలుగు: బీఆర్ఎస్  మంచిర్యాల యూత్ టౌన్ జనరల్ సెక్రెటరీ గడప రాకేశ్​పై గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం ఉదయం దాడి చేశారు. హాకీ స్టిక్స్, ఐరన్ రాడ్స్ తో విచక్షణారహితంగా కొట్టారు. ఆయన కారును ధ్వంసం చేశారు.  తీవ్రంగా గాయపడిన రాకేశ్​ మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్​లో చికిత్స పొందుతున్నాడు. స్థానిక హైటెక్ సిటీ కాలనీలో ఉంటున్న రాకేశ్​ ఉదయం 5:30 గంటలకు జిమ్ కు వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఆయన కారును వెనక నుంచి ఢీకొట్టారు. ఏం జరిగిందోనని ఆయన కిందకు  దిగేసరికి బైకులపై వచ్చిన దాదాపు 15 మంది వ్యక్తులు రౌండప్​ చేశారు. హాకీ స్టిక్స్, ఐరన్ రాడ్స్ తో దాడి చేశారు. ఈ దాడిలో రాకేశ్ ​చేతులకు ఫ్రాక్చర్ కాగా, కారు ధ్వంసమైంది.  గమనించిన స్థానికులు ఓ ప్రైవేట్ హాస్పిటల్​కు తరలించారు.  మంచిర్యాల ఎమ్మెల్యే సన్నిహితుడు జగన్మోహన్​రావు అనుచరులే తనను హత్య చేయడానికి ప్రయత్నించారని రాకేశ్ ​పీఎస్​లో ఫిర్యాదు చేశాడు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు హైదరాబాద్​ నుంచి మంచిర్యాల వచ్చి రాకేశ్​ను పరామర్శించారు. జగన్ మోహన్ రావు అనుచరులే దాడి చేశారని ఆరోపించారు. దాడి కేసులో పోలీసులు పెంటిక్ రవి, ఆత్మకూరి సంజు, సాయి  అండ్ అదుర్స్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.