తిరుపతిలో హైటెన్షన్​.. టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కూడా దాడులు ఆగటం లేదు. తాజాగా నేడు ( మే 14)  తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. చంద్రగిరి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని పై దాడి జరిగింది. పద్మావతి మహిళా యూనివర్సిటీ సమీపంలో వెళుతున్న పులివర్తి నాని వాహనంపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. ఆయన వాహనాన్ని తీవ్రంగా ధ్వంసం చేశారు.

పద్మావతి యూనివర్సిటీలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ఉండడంతో, అక్కడ భద్రతను పరిశీలించేందుకు పులివర్తి నాని అక్కడకు వెళ్లి, అక్కడి నుంచి తిరిగి వస్తున్న క్రమంలో ఆయన పైన దాడి జరిగింది. వైసీపీ కార్యకర్తల దాడిలో పులివర్తి నాని కారు ధ్వంసం కాగా, నాని భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.పులివర్తి నాని పై దాడికి పాల్పడుతున్న వైసీపీ శ్రేణులను చెదరగొట్టడం లో భాగంగా నాని భద్రతా సిబ్బంది రెండు రౌండ్లు గాలిలో కాల్పులు జరిపారు. తనపై దాడి జరగటంతో మహిళా యూనివర్సిటీ రోడ్డుపైనే పులివర్తి నాని బైఠాయించి నిరసన తెలిపారు. 

పులివర్తి నానిపై దాడి జరగడంతో టిడిపి శ్రేణులు అలర్ట్ అయ్యారు.   ఘటన జరిగిన ప్రాంతంలో ఒక ఎరుపు రంగు హుండాయ్ కారు ఉండడంతో ఆ కారులో వైసీపీ  కండువాలు, మద్యం బాటిళ్లు కనిపించడంతో టీడీపీ నేతలు, దాడి చేసిన వారు ఉపయోగించిన కారుగా గుర్తించి ఆ కారును ధ్వంసం చేశారు.  దాడిని నిరసిస్తూ మహిళా వర్సిటీ రహదారిపై  నాని  బైఠాయించి ఆందోళన చేపట్టారు. రామాపురంకు చెందిన వైసీపీ నేత భాను అతని అనుచరులు సుత్తి, రాడ్లుతో పులివర్తి నాని పై దాడి చేసిన వైసీపీ కార్యకర్తల పైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.