రంగరాజన్పై దాడి అమానవీయం.. రాముని పేరుపై దాడులు చేస్తే సహించం: మంత్రి శ్రీధర్ బాబు

రంగరాజన్పై దాడి అమానవీయం.. రాముని పేరుపై దాడులు చేస్తే సహించం: మంత్రి శ్రీధర్ బాబు

రంగారెడ్డి: చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ పరిధిలోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై జరిగిన దాడిని మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా ఖండించారు. రంగరాజన్ను మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి హనుమంతరావు మంగళవారం నాడు పరామర్శించారు. రంగరాజన్ తండ్రి ఎంవీ సౌందర్ రాజన్ను కలిసి ఆరోగ్య పరిస్థితిపై మంత్రి శ్రీధర్ బాబు, మహేందర్ రెడ్డి ఆరా తీశారు. దాడి ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ ఘటనపై మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రంగరాజన్పై దాడి అమానవీయ చర్య అని, తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. రాముని పేరుపై దాడులు చేస్తే సహించేది లేదని, నిందితుల్లో ఇప్పటికే కొందరిని పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. రామరాజ్యం పేరిట అరాచకాలు సాగిస్తే సహించేది లేదని, చిలుకూరు బాలాజీ దేవాలయం వద్ద భద్రత పెంచమని ఆదేశిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. దేవుని పేరు, రామును పేరు మీద దాడులు చేయడం దురదృష్టకరమని చెప్పారు. రంగరాజన్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని ఆయన తెలిపారు.

రంగరాజన్పై దాడి.. అసలేం జరిగింది..?
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్​ రంగరాజన్పై దాడి జరిగింది. శుక్రవారం(ఫిబ్రవరి 7, 2025) ఉదయం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గుంపుగా రంగరాజన్ ఇంటికి వెళ్లి రామరాజ్యం స్థాపనకు మద్దతు ఇవ్వాలని, తమ గ్రూప్కు ఆర్థిక సాయం చేయాలని, చిలుకూరు ఆలయ బాధ్యతలు తమకు అప్పగించాలని కోరారు. దానికి రంగరాజన్​ నిరాకరించడంతో దాడికి దిగారు. దాడిని అడ్డుకోబోయిన రంగరాజన్  కుమారుడిని కూడా కొట్టినట్టు సమాచారం.

Also Read :- రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రద్దు

తాము ఇక్ష్వాకు వంశస్థులమని, ఆలయ పరిధిలో ఈ గోత్రం ఉన్నవారిని, శాస్త్రం నేర్చేవారిని ఎందుకు గుర్తించడం లేదని రంగరాజన్ను ప్రశ్నించారు. ఊరికే కోర్టులో కేసులు వేస్తే ఏం లాభమని, తాము చెప్పినట్టు వినాలన్నారు. ఉగాది వరకు టైం ఇస్తున్నామని, రామరాజ్య స్థాపనకు సహకరించకపోతే తాము రామని, వచ్చేవారు వచ్చి పనిచేసుకుని వెళ్తారని హెచ్చరించారు. కాగా.. ఈ ఘటనపై చిలుకూరు బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్  ఎంవీ సౌందర్ రాజన్  పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారితో పాటు సహకరించిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్ స్పందిస్తూ.. తనపై 20 మంది దాడి చేశారని, పోలీసులకు కంప్లయింట్​ చేశానని చెప్పారు. ఈ దాడిలో ప్రధాన నిందితుడు వీరరాఘవ రెడ్డితో పాటు మరికొందరిని మొయినాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.