సోషల్​ మీడియా ద్వారా హిందుత్వంపై ముప్పేట దాడి

సోషల్​ మీడియా ద్వారా హిందుత్వంపై ముప్పేట దాడి

సోషల్​ మీడియా ద్వారా భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక కుట్ర జరుగుతున్నది. ఇందుకు కొన్ని ముస్లిం దేశాలు అధికారిక వ్యవస్థలను ఉపయోగిస్తూ పెద్ద ఎత్తున నిధులు కూడా ఖర్చు చేస్తున్నాయి. హిందువులను అనాగరికులుగా, మూర్ఖులుగా, హింసోన్మాదులుగా, మూకుమ్మడి దోపిడీలు, హత్యలు చేసే వారీగా చిత్రీకరించేందుకు, హిందూ ఆధ్యాత్మిక కేంద్రాలను, ఆరాధాన విధానాలను కించపరుస్తూ పెద్ద ఎత్తున విషప్రచారం జరుగుతున్నది. భారతదేశంలో ముస్లిం వ్యతిరేక చర్యలకు పెద్ద ఎత్తున తెగబడుతున్నారని, హిందువులు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాల్లో మిగిలిన మైనార్టీలకు ఆస్తి, ప్రాణాలకు భద్రత లేకుండా పోతోందన్న అసత్య ప్రచారం నిరవధికంగా కొనసాగుతున్నది. విదేశాల్లో ఉంటున్న హిందువులపై కూడా విషం కక్కుతూ ఆయా దేశాల్లో ఉంటున్న శ్వేత వర్ణీయులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వారి ద్వారా హిందువులపై దాడులు చేయించేందుకు కూడా ప్రచార యుద్ధం ప్రారంభమైంది. 

పలు సర్వేల్లో వెల్లడి

హిందూ వ్యతిరేక నినాదాల మీమ్​లు తయారు చేయించడం, ప్రచారం చేయడం కోసం పెద్ద పెద్ద సంస్థలతో పెద్ద మొత్తంతో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటున్నారు. కొన్ని దేశాల్లో దీని కోసం‘డాట్​బస్టర్స్’ అంటూ సంస్థలు కూడా ఏర్పాటయ్యాయి. రట్​జర్స్​మిల్లర్​సెంటర్​ఫర్​కమ్యూనిటీ ప్రొటెక్షన్​అండ్​రీసైలెన్స్, నెట్​వర్క్​ కంటేజియన్​రీసెర్చ్​ఇన్​స్టిట్యూట్​తదితర సంస్థల ఆధ్వర్యంలో ప్రసిద్ధ సుధాకర్, ఆమె బృంద సభ్యులు ఇటీవలి కాలంలో ఒక రీసెర్చ్​ పేపర్​ ప్రచురితమైంది. సోషల్​మీడియా ద్వారా పెద్ద ఎత్తున హిందూ వ్యతిరేక అసత్యప్రచారం జరుగుతోందని వారి రీసెర్చ్​లో ఆధారాలతో సహా వివరించారు. ఎన్​సీఆర్ఐ అనే సంస్థ సర్వేలోనూ అనేక విషయాలు బయటకొచ్చాయి. హిందువులను దుర్మార్గులుగా, అత్యాచారాలు చేసే వారిగా, మూకుమ్మడి హత్యలు చేసేవారిగా, అపరిశుభ్రంగా ఉండేవారిగా చిత్రీకరించే పద్ధతి ఇది వరకు 4 చాన్(ఫోర్​చాన్)​, టెలిగ్రామ్, గాబ్​లాంటి సోషల్​మీడియా ప్లాట్​ఫామ్స్​కే పరిమితమయ్యేది. తర్వాతి కాలంలో ట్విట్టర్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా కూడా విపరీతంగా విష ప్రచారం జరుగుతున్నదని ఎన్​సీఆర్ఐ పేర్కొన్నది. ఈ సంస్థ దాదాపు 10 లక్షల ట్వీట్లను పరిశీలించిన తర్వాత హిందువులపై ముప్పేట దాడికి రంగం సిద్ధం అవుతున్నదన్న ప్రమాద ఘంటికలను మోగించింది.

‘పజీత్’​ అనే శబ్ద ప్రయోగం..

4 చాన్ ​మాధ్యమంలో హిందువులను కించపరిచే విధంగా​‘పజీత్’​ అనే శబ్ద ప్రయోగం ప్రారంభమై నెమ్మదిగా మిగతా అన్ని చానళ్లకు పాకింది. హిందువులను మతఛాందస వాదులుగా, కించ పరిచే విధంగా వాడుకలో ఉన్న ఈ పదం కెనడాలో పుట్టింది. ముంబయిలో 26/11న జరిగిన దాడులను గొప్పగా చిత్రీకరిస్తూ, చనిపోయిన బాధిత హిందూ కుటుంబాలను వ్యంగ్యంగా చిత్రీకరిస్తూ.. ఎప్పటికైనా తమదే ఆధిపత్యం అంటూ అనేక తీవ్రవాద సంస్థలు, హిందూ వ్యతిరేక సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేశాయి. హిందువులు బలహీనులు, పిరికి పందలు, ఎందుకూ పనికిరాని వాళ్లు అని చిత్రీకరించడమే వీరి పని. అప్పటి వరకు కొన్ని గుప్త మాధ్యమాలకు మాత్రమే పరిమితమైన ‘పజీత్’ అన్న పదం 2021 నవంబర్​లో పరాగ్​అగర్వాల్​ ట్విట్టర్​కు సీఈవోగా 
నియమితులైన తర్వాత ప్రధాన మాధ్యమాల్లో తరచూ కనబడటం మొదలైంది. ‘టిక్​టాక్’లో  పజీత్​అన్న పదంలో ఉన్న వీడియోలను దాదాపు 20 లక్షల మంది చూశారు. 4 చాన్​ఇతర మాధ్యమాల్లో ఉన్నట్లుగానే వీటిల్లో కూడా హిందూ వ్యతిరేక భావాలు నిండి ఉన్నాయి. 

చిచ్చుపెట్టడానికి కుట్రలు..

భారత దేశంలో అశాంతిని రెచ్చగొట్టడానికి హిందూ–ముస్లింల మధ్య చిచ్చు పెట్టడానికి ఇరాన్​అధికారిక సంస్థలు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాయి. మార్చి 2017లో భోపాల్– ఉజ్జయిని ప్యాసెంజర్​ రైలులో ఇస్లామిక్ ​తీవ్రవాదులు జరిపిన బాంబు దాడిని హిందూ తీవ్రవాదులే చేశారంటూ అసత్య ప్రచారం చేయడానికి 4 సంస్థలు పెద్ద ఎత్తున పనిచేశాయి. ఆగస్టు 2017లో శ్రీనగర్​లోయలో బుర్హన్​వానీ చనిపోయిన సంఘటనను అడ్డం పెట్టుకొని కాశ్మీర్​లో మైనార్టీలను అణచివేస్తున్నారంటూ ప్రచారం చేశారు. 2018లో ఇరాన్​అధ్యక్షుడు డాక్టర్​హసన్​రేహానీ భారత్ రాక సందర్భంగా భారత దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదంటూ ఇరాన్​నుంచి1053 ట్రోల్స్​వచ్చాయి. ఇటీవలి కాలంలో హిందూ వ్యతిరేక, భారత వ్యతిరేక ప్రచారం సామాజిక మాధ్యమాల్లో ఉహించని వేగంతో జరుగుతున్నది. ప్రపంచ దేశాల్లో భారత పరువు ప్రతిష్టలను, హిందుత్వ సిద్ధాంతాలను అపహాస్యం పాలు చేయడానికి అంతర్గతంగా కుట్ర జరుగుతున్నది. ఇందుకు సామాజిక మాధ్యమాలు ఒక వేదికగా మారుతున్నాయి. వీటి ప్రభావానికి లోనైన వారు దేశంలోని కుహనా మేధావులు అగ్నికి ఆజ్యం పోసి సమాజంలో వైషమ్యాలను పెంచుతున్నారు. 
భారతీయులందరూ విజ్ఞతతో విదేశీ కుట్రను ఎదుర్కోవాల్సి ఉంటుంది. హిందుత్వంపై, భారత్​పై జరుగుతున్న ఈ ముప్పేట దాడిని ఎదుర్కొనకపోతే అవమానాలపాలు గాక తప్పదు.

గుర్తు తెలియని ప్లాట్​ఫామ్స్​ద్వారా..

4 చాన్​ అనేది గుర్తు తెలియని ఓ వెబ్​సైట్. 2003 అక్టోబర్​లో ప్రారంభమైంది. దాదాపు70 లక్షల మంది సభ్యులున్నారు. రిజిస్ట్రేషన్​ చేసుకున్నవారు మాత్రమే ఇందులో పోస్టులు పెట్టగలరు. పోస్టులు పెట్టేవారు తమకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదు. అంటే గుర్తు తెలియని వ్యక్తులు ఏది పడితే అది ఇందులో రాయగలరు. హింసోన్మాదంతో కూడుకున్న, మూకుమ్మడి హత్యలకు సంబంధించిన, హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. ‘గాబ్’ కూడా ట్విట్టర్ కు సంబంధించిన ఒక సామాజిక మాధ్యమ సంస్థ. ‘టెలిగ్రామ్’లో వచ్చే  వ్యాఖ్యలను గుప్తంగానే ఉంచుతూ దాదాపు అయిదు కోట్ల మంది ఈ వేదికను వాడుతుంటారు. కొన్ని హిందూ వ్యతిరేక సంస్థలు ఈ వేదికను వాడుకుంటున్నాయి. 

ఇతర దేశాలతో సంబంధాలనూ దెబ్బ తీసే యత్నం..

భారత్​కు ఇతర దేశాలతో ఉన్న సంబంధాలను చెడగొట్టడం కోసం కూడా సామాజిక మాధ్యమాల ద్వారా హిందూ వ్యతిరేక శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్​ దేశంలోని కొన్ని అధికారిక, అనధికారిక సంస్థలు ఇదే పనిలో నిమగ్నమై ఉన్నాయి. 1980–1990 దశకంలో హిందూ సమాజంపై జరిగిన దాడుల విధంగానే మరోసారి అలాంటి హిందూ వ్యతిరేక వాతావరణాన్ని కల్పించడం కోసం ఈ సంస్థలు పనిచేస్తున్నాయి. జనవరి 2019 నుంచి జూన్​2022 వరకు ఎస్​సీఆర్​ఐ జరిపిన సర్వేలో అనేక హిందూ వ్యతిరేక శక్తులు లక్షలాది గ్రూపులను ఏర్పాటు చేసుకొని కొత్త కొత్త యాష్​ట్యాగ్​లతో మీమ్స్​ తయారు చేస్తూ.. హిందూ వ్యతిరేక  భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు ప్రయత్నించాయని తేలింది. వీరికి మద్దతుగా ఐఎస్ఐఎస్​తోపాటు ఇతర ఇస్లామిక్​తీవ్రవాద సంస్థలు కూడా విష ప్రచార ఉద్యమంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. హిందూ వ్యతిరేక భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో 4 చాన్, గాబ్, టెలిగ్రామ్​లాంటి సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్స్​ ప్రధాన పాత్ర పోషించాయని ఈ నివేదిక పేర్కొంది.

- కామర్సు బాలసుబ్రహ్మణ్యం
బీజేపీ పార్లమెంట్​ కార్యాలయ కార్యదర్శి