కారులో వెళుతున్న ఐటీ జంట: వెంటాడి మరీ వేధించిన 40 మంది పోకిరీలు

కారులో వెళుతున్న ఐటీ జంట: వెంటాడి మరీ వేధించిన 40 మంది పోకిరీలు

ముంబై: సాఫ్ట్‎వేర్ దంపతులపై ఒక్కరు కాదు ఇద్దరూ కాదు ఏకంగా 40 మంది దాడికి యత్నించారు. కారును వెంబడించి కర్రలు, ఇనుప రాడ్లతో ఎటాక్ చేసేందుకు ట్రై చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణే జిల్లా సుస్‎లో చోటు చేసుకుంది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు అయిన రవి కర్ణానీ అతని భార్య మంగళవారం (అక్టోబర్ 1) రాత్రి బంధువుల ఇంటికి డిన్నర్‎కు వెళ్లారు. అనంతరం లావలే- నాందే రోడ్‌‎లో తిరిగి ఇంటి బయలు దేరారు. ఈ క్రమంలో గుర్తు తెలియని దాదాపు 40 మంది దుండగులు టెక్కీ దంపతులపై దాడికి పాల్పడ్డారు. టెక్కీ దంపతుల కారును బైకులపై వెంబడించి కర్రలు, ఇనుప రాడ్లతో దాడికి యత్నించారు. 

Also Read :- స్నేహితులే మోసం చేసి రూ. 8 లక్షలు కాజేశారు

ఈ అనుహ్య ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన రవి కర్ణానీ కారును వేగంగా డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి చేరుకున్నారు. అనంతరం ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని దుండగులు వేర్వేరు చోట్ల తమ కారును అడ్డుకుని దాడి చేసేందుకు ప్రయత్నించారని కంప్లైంట్ చేశారు. దాడికి సంబంధించి తమ కారు కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలను పోలీసులకు అందించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగారు. టెక్కీ దంపతులను భయబ్రాంతులకు గురి చేసిన పోకిరీల కోసం గాలింపు చేపట్టారు.