గన్నేరువరం, వెలుగు : ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట పోలీస్‌స్టేషన్‌కు రాగా.. అమ్మాయి తరఫు బంధువులు అబ్బాయిపై దాడికి యత్నించారు. పోలీసుల వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన ఇక్కుర్తి కిరణ్ (28), అదే గ్రామానికి చెందిన రాపోలు రమ్య(23) ప్రేమించుకున్నారు. వేర్వేరు కులాలు కావడంతో కుటుంబ సభ్యులు వారి పెళ్లికి ఒప్పుకోలేదు.
దీంతో శనివారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం గన్నేరువరం పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న అమ్మాయి తరఫు బంధువులు, కుటుంబసభ్యులు స్టేషన్‌కు వెళ్లి కిరణ్‌పై దాడికి ప్రయత్నించారు. అప్రమత్తమైన ఎస్సై నరేశ్ సిబ్బందితో వారిని చెదరగొట్టారు. తమకు రక్షణ కల్పించాలని కొత్త జంట పోలీసులను వేడుకున్నారు.