మల్లారెడ్డికి నిరసన సెగ

  • మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్​పై దాడి
  • చెప్పులు, రాళ్లు, బాటిళ్లు, కుర్చీలు విసిరిన జనం
  • ఘట్‌‌కేసర్‌‌‌‌లో జరిగిన రెడ్ల సింహగర్జన మీటింగ్‌‌లో ఉద్రిక్తత
  • కేసీఆర్‌‌, టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ను పదేపదే పొగడటంతో ఆగ్రహం
  • స్పీచ్‌‌ను అడ్డుకోవడంతో మధ్యలోనే ఆపి వెళ్లిపోయిన మంత్రి
  • కాన్వాయ్‌‌ని వెంటాడి దాడి చేసిన నిరసనకారులు

హైదరాబాద్ : రెడ్ల సింహగర్జన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. సభకు హాజరైన జనం.. మంత్రి మల్లారెడ్డి మాట్లాడకుండా అడ్డుకున్నారు. పదేపదే సీఎం కేసీఆర్‌‌, టీఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని పొగుడుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆయన స్పీచ్ మధ్యలోనే ఆపి వెళ్లిపోతుండగా.. కాన్వాయ్‌పై దాడి చేశారు. చెప్పులు, రాళ్లు, బాటిళ్లు, కుర్చీలు విసిరేశారు. భారీ బందోబస్తు మధ్య పోలీసులు మల్లారెడ్డిని సభా ప్రాంగణం నుంచి బయటకు తీసుకెళ్లారు


రెడ్డి కార్పొరేషన్ ఏమైంది?
రూ.5 వేల కోట్లతో రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఆదివారం రాత్రి రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో ఘట్‌కేసర్ ఓఆర్ఆర్ వద్ద రెడ్ల సింహగర్జన సభ నిర్వహించారు. మల్లారెడ్డి హాజరై మాట్లాడారు. తన ప్రసంగంలో పదేపదే సీఎం కేసీఆర్‌‌ను, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పొగిడారు. దీంతో మీటింగ్‌కు హాజరైన వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్డి కార్పొరేషన్ ఏమైందంటూ ప్రశ్నించారు. ‘సీఎం దృష్టికి తీసుకెళ్తా.. కార్పొరేషన్ ఏర్పాటు చేయిస్తా’ అని ఆయన చెప్పడంతో ఇంకెన్నాళ్లు మాటలతో మభ్యపెడతారంటూ జనం ఊగిపోయారు. మల్లారెడ్డిని మాట్లాడనివ్వలేదు. దీంతో ‘ఇది రెడ్ల చిల్లర ప్రయత్నం’ అని ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి అనడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఇదే సమయంలో మల్లారెడ్డి టీఆర్ఎస్, కేసీఆర్ పేరెత్తడంతో కుర్చీలు పైకి లేపి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో మధ్యలోనే ప్రసంగం ఆపేసి మల్లారెడ్డి వెళ్లిపోయారు. మంత్రి కాన్వాయ్‌ వెంట పడిన యువత.. కారుపై కుర్చీలు, వాటర్ బాటిళ్లతో దాడి చేశారు. పోలీసులు ఆయన్ను భారీ భద్రత మధ్య అక్కడి నుంచి తీసుకెళ్లారు.

 

మాట్లాడనీయాలె కదా..
అంతకుముందు మల్లారెడ్డి మాట్లాడుతుండగా.. కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తామని వెంటనే ప్రకటించాలంటూ కొందరు స్టేజీపైకి వచ్చారు. దీంతో వారికి నిర్వాహకులు నచ్చజెప్పారు. “ప్రభుత్వం ఎన్నో స్కీమ్‌లు అమలు చేస్తున్నది. బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి బ్రాహ్మణులను ఆదుకొంటోంది. నేను అబద్ధాలు, జూటా మాటలు చెప్పను. మీకు కూడా తప్పకుండా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తం. ప్రతి ఊర్లో, ప్రతి పట్టణంలో రెడ్డి లేని ప్రాంతం లేదు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఊర్లు డెవలప్ కాలే. ఇప్పుడు డంపింగ్ యార్డ్, గ్రేవ్ యార్డ్, ట్రాక్టర్, ట్రాలీ, నర్సరీ ఉంది. వీటిని తీర్చిదిద్దింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా.. కొంచెం ఓపిక పట్టండి. మాట్లాడనీయాలె కదా” అంటూ మల్లారెడ్డి తన స్పీచ్‌ను మధ్యలోనే ఆపేశారు.

మరిన్ని వార్తల కోసం : -
ప్రజలు తలుచుకుంటేనే రాజ్యాంగ పదవులొస్తాయి


నిర్లక్ష్యానికి కఠిన చర్యలు.. పని చేస్తే ప్రమోషన్స్..!