ప్రేమించి పెండ్లి చేసుకున్నారని నవ దంపతులపై దాడి

గన్నేరువరం, వెలుగు:  కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం హనుమాజిపల్లెలో నవ దంపతులపై అమ్మాయి తరఫు బంధువులు మంగళవారం దాడి చేశారు. బాధితులు, స్థానికుల కథనం ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం బెగ్లర్  గ్రామానికి చెందిన కొయ్యల హేమలత (22) కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం  హనుమాజిపల్లె కు చెందిన రాధారం రమేశ్‌‌(25) ప్రేమించుకుని, ఈనెల 6న చిగురుమామిడి మండలం సుందరగిరి వేంకటేశ్వర స్వామి ఆలయంలో పెండ్లి చేసుకున్నారు. 

తర్వాత అమ్మాయి తరఫు నుంచి ప్రాణహాని ఉందని గన్నేరువరం పోలీస్ స్టేషన్​లో దంపతులు ఫిర్యాదు చేశారు. దీంతో అమ్మాయి పేరెంట్స్​ను పిలిపించి పోలీసులు కౌన్సెలింగ్​ఇచ్చారు. ఈక్రమంలో మంగళవారం హనుమాజిపల్లెలోని ఇంట్లో  భోజనం చేస్తున్న దంపతులపై హేమలత తల్లిదండ్రులు, బంధువులు దాడి చేశారు. ఆమెను ఈడ్చుకుంటూ కారులో ఎక్కించుకునే ప్రయత్నం చేయగా స్థానికులు అడ్డుకున్నారు. 

పోలీసులకు సమాచారమివ్వగా ఘటనా స్థలానికి చేరుకొని అమ్మాయి తల్లిదండ్రులను, బంధువులను పోలీస్​స్టేషన్​కు తరలించారు. తమకు ప్రాణహాని ఉందని పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఇప్పటికైనా తమకు రక్షణ కల్పించాలని రమేశ్ ​పోలీసులను వేడుకున్నాడు.