ఇంటిని పంచుతలేరని తల్లిదండ్రులపై దాడి

సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం అల్లిపూర్ గ్రామంలో  కన్న కొడుకే  కసాయిగా మారి తన తల్లిదండ్రులపై బుధవారం దాడి చేశాడు. కర్రతో విచక్షణారహితంగా కొట్టడంతో తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు.  గ్రామానికి చెందిన  కొమ్ము పోచాలు, రాజమ్మ దంపతులకు కొడుకు రాజమల్లు, ఓ కుమార్తె ఉన్నారు. కొడుకు కుటుంబం తల్లిదండ్రులతోనే ఉంటోంది. రాజమల్లుకు, తల్లిదండ్రులకు మధ్య ఇంటి పంపకం విషయమై చాలా కాలంగా గొడవలు జరుగుతున్నాయి.  

పెద్దమనుషులు పంచాయితీలు కూడా చేశారు. దీంతో ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని కొడుకును  తల్లిదండ్రులు కోప్పడ్డారు. ఈ క్రమంలో బుధవారం ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న పోచాలు, రాజమ్మ దంపతులతో గొడవపడిన రాజమల్లు కర్రతో దాడి చేశాడు.  రాజమ్మ తలకు తీవ్రగాయమై రక్తస్రావమైంది. పోచాలు కూడా తీవ్రంగా గాయపడ్డాడు.  స్థానికులు సుల్తానాబాద్ ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లి చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్ హాస్పటల్ కు తరలించారు.