పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీసుపై గురువారం (జనవరి 23) కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌ను ముట్టడించి కుర్చీలు విరగొట్టి, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఈ క్రమంలో క్యాంప్ ఆఫీసుపై దాడి చేసిన వారిపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే సిబ్బంది కంప్లైంట్ మేరకు క్యాంప్ ఆఫీసుపై దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలపై పటాన్ చెరు పోలీసుల కేసు నమోదు చేశారు. వివిధ సెక్షన్ల కింద మొత్తం 42 మందికి పైగా కార్యకర్తలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. మరికొంతమందిపై కేసులు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, అదే నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇద్దరి మధ్య వర్గ పోరు గురువారం (జనవరి 23) రోడ్డుకెక్కింది. ఎమ్మెల్యే గూడెంకు వ్యతిరేకంగా కాట వర్గీయులు ఆందోళన చేశారు. సేవ్ కాంగ్రెస్.. సేవ్ పటాన్ చెరు అంటూ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసుందుకు ప్రయత్నించారు.
ALSO READ | ఎవరిని వదలొద్దు.. కిడ్ని రాకెట్ కేసు సీఐడీకి అప్పగించిన ప్రభుత్వం
అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ముట్టడించి దాడి చేశారు కాట అనుచరులు. మహిపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీసులోని కుర్చీలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. కాట, గూడెం ఇష్యూపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై విచారణ కోసం ఇద్దరు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా పీసీసీ క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది.