కేసీఆర్​పై కేసు పెట్టిన రాజలింగమూర్తి హత్య..చంపింది ఎవరు?

కేసీఆర్​పై కేసు పెట్టిన రాజలింగమూర్తి హత్య..చంపింది ఎవరు?
  • భూపాలపల్లిలో నడిరోడ్డుపై కత్తులతో పొడిచిన దుండగులు.. అక్కడికక్కడే మృతి
  • మేడిగడ్డ కుంగుబాటుపై కొన్నాళ్లుగా రాజలింగమూర్తి పోరాటం
  • అందులో భాగంగానే కేసీఆర్​, హరీశ్​ సహా అప్పటి ఆఫీసర్లపై కోర్టులో ప్రైవేట్  కేసు ఫైల్

జయశంకర్ భూపాలపల్లి/ భూపాలపల్లి రూరల్, వెలుగు: కాళేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు విషయంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్​రావు , ఇతర అధికారులపై కోర్టులో కేసు వేసిన నాగవెల్లి రాజలింగమూర్తి(50) హత్యకు గురయ్యారు. బుధవారం రాత్రి భూపాలపల్లి పట్టణంలో నడిరోడ్డుపై ఆయనను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా చంపేశారు. కడుపులో, తలపై కత్తులతో పొడిచారు. పేగులు బయటపడి రాజలింగంమూర్తి అక్కడిక్కడే చనిపోయారు. 

బీఆర్​ఎస్​ హయాంలో పీడీ యాక్ట్​

భూపాలపల్లి మున్సిపాలిటీలోని రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న రాజలింగమూర్తి భార్య సరళ గత పాలకవర్గంలో బీ ఆర్ ఎస్ తరఫున 15వ వార్డు కౌన్సిలర్​గా పోటీ చేసి గెలిచారు. 

కొద్ది రోజులకే అప్పటి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డిపై రాజలింగమూర్తి తిరుగుబాటుచేశారు. గండ్ర అనుచరులకు, రాజలింగమూర్తికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారైంది. ఈ రెండు వర్గాల నడుమ అనేక భూ వివాదాలు నడిచాయి. బీఆర్ఎస్​ హయాంలో పోలీసులు రాజలింగమూర్తి పై రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఆ తర్వాత పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించారు. జైలు నుంచి వచ్చిన తర్వాత మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు విషయంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్​రావు , ప్రాజెక్టు అధికారులపై ఆయన కోర్టులో ప్రైవేట్ కేసు వేశారు. రూ. లక్షా 35 వేల కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ కొద్ది సంవత్సరాలకే కుంగిపోయిందని, పెద్దమొత్తంలో ప్రజాధనం దుర్వినియోగమైందని.. దీనికి బాధ్యులైన కేసీఆర్​, హరీశ్​రావు, ప్రాజెక్టు అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ పోరాటం మొదలుపెట్టారు. 

రాజలింగమూర్తి వేసిన ప్రైవేట్ కేసును విచారణకు స్వీకరించిన భూపాలపల్లి జిల్లా కోర్టు.. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్​రావు , అప్పటి నీటి పారుదల శాఖ కార్యదర్శి రజత్‌‌ కుమార్‌‌, అప్పటి సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌‌, ఇంజినీరింగ్‌‌ ఉన్నతాధికారులు హరిరామ్‌‌, శ్రీధర్‌‌, మేఘా నిర్మాణ సంస్థ అధినేత మేఘా కృష్ణారెడ్డి, ఎల్‌‌ అండ్‌‌ టీ సంస్థలకు నోటీసులు పంపించింది. 

కత్తులతో పొడిచి పరార్

రాజలింగమూర్తి బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో బైక్​పై ఇంటికి బయలుదేరారు. అంబేద్కర్ చౌరస్తా పరిసరాల్లోని టీబీజీకేఎస్​ ఆఫీస్​ వద్దకు రాగానే ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు.. రాజలింగమూర్తి వాహనాన్ని అడ్డుకున్నారని పోలీసులు తెలిపారు. ఆయనను కత్తులతో విచక్షణ రహితంగా పొడిచారని,  పొట్టలో పొడవడంతో పేగులు బయటకు వచ్చాయని తెలిపారు. రాజలింగమూర్తి చనిపోయినట్లు నిర్ధారించుకొని ఆ గుర్తుతెలియని వ్యక్తులు పారిపోయారని పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని  భూపాలపల్లి సీఐ నరేశ్​కుమార్ ప్రకటించారు.  

చంపింది ఎవరు? 

రాజ లింగమూర్తిని చంపింది ఎవరు? లోకల్ వాళ్లా? లేక ఎవరైనా సుపారీ ఇచ్చి మర్డర్ చేయించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం ఈ మర్డర్ జరిగినట్లు సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం పోలీసులు పేర్కొన్నారు.