షాద్ నగర్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్స్ పై దాడి

షాద్ నగర్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్స్ పై దాడి
  • నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు 
  • ఆస్పత్రి ఎదుట వైద్య సిబ్బంది నిరసన

షాద్ నగర్, వెలుగు : స్టాఫ్ నర్స్ పై మహిళ దాడికి పాల్పడిన ఘటన షాద్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. గురువారం స్టాఫ్ నర్స్ దాసరి ఆశ డ్యూటీలో ఉండగా.. టౌన్ లోని బృందావన్ కాలనీకి చెందిన నీలం రేణిగుంట భార్గవి అనే మహిళ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆస్పత్రికి వెళ్లింది. కుక్కకాటు సెకండ్ డోస్ ఇంజక్షన్ వేయమని స్టాఫ్ నర్స్ ను ఆమె అడిగింది.

 మొదటి డోస్ చిట్టి తీసుకురావాలని సూచించగా భార్గవి అక్కడి నుంచి వెళ్లిపోయింది. తిరిగి సాయంత్రం6 .30 గంటలకు ఆస్పత్రికి వచ్చింది. మళ్లీ చిట్టీ తీసుకొని రాకపోవడంతో ఆమెకు.. స్టాఫ్ నర్స్ కు మధ్య మాటామాటా పెరిగింది. దీంతో స్టాఫ్ నర్స్ ఆశను జుట్టు పట్టుకుని చెప్పుతో భార్గవి దాడికి పాల్పడింది. దీంతో తోటి సిబ్బంది స్టాఫ్ నర్స్ ను పక్కకు తీసుకెళ్లారు. అనంతరం రాత్రి పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. నిందితురాలు భార్గవిని శుక్రవారం అరెస్టు చేశారు. స్టాఫ్ నర్స్ పై దాడికి పాల్పడిన నిందితురాలిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిరసన తెలిపారు.