తెలంగాణ పోలీసులపై కడప జిల్లాలో దాడి.. ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలు

దేవరకొండ (చందంపేట), వెలుగు: తెలంగాణ పోలీసులపై ఏపీలోని కడప జిల్లాలో దాడి జరిగింది. ఈ ఘటనలో నల్గొండ జిల్లా చందంపేట ఎస్‌ఐ సతీశ్‌తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. పోలీసుల వెహికల్‌ కూడా ధ్వంసమైంది. చందంపేట మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన ఆరుగురు రైతుల వద్ద.. ఏపీలోని కడప జిల్లా మైదుకూరు మండలం చిన్నయ్యవారిపల్లి గ్రామానికి చెందిన శివయ్య, మల్లికార్జున్‌, సాంబయ్య గొర్రెలను కొనుగోలు చేసి, డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోయారు.

దీంతో కంబాలపల్లికి చెందిన రైతు అంజయ్య వారిపై గత నెలలో కేసు పెట్టాడు. ఈ క్రమంలో ఎస్‌ఐ సతీశ్‌.. ఇద్దరు కానిస్టేబుళ్లను తీసుకొని శుక్రవారం నిందితులను అరెస్ట్ చేసేందుకు చిన్నయ్యవారిపల్లికి వెళ్లారు. విషయం తెలుసుకున్న నిందితులు ఎస్‌ఐ, కానిస్టేబుళ్లపై దాడి చేసి, వారి వెహికల్‌ను ధ్వంసం చేశారు.అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. తర్వాత నిందితులపై మైలవరం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని ఎస్‌ఐ సతీశ్‌ వెల్లడించారు.