
మనోహారాబాద్, వెలుగు: మట్టిని అక్రమంగా రవాణా చేస్తున్న టిప్పర్లను అడ్డుకున్న వీఆర్ఏలపై మట్టి మాఫియా దాడి చేసింది. బాధితులు, పోలీసుల వివరాల ప్రకారం.. మనోహరాబాద్ మండలం కుచారం శివారు నుంచి జీడిపల్లి శివారులోని ఓ ప్రైవేట్ కంపెనీకి సోమవారం రాత్రి టిప్పర్ల ద్వారా మట్టి రవాణా జరుగుతోంది. గమనించిన స్థానికులు ఆర్‌ఐ దీక్షిత్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకు వీఆర్ఏలు నరేశ్, రవి, ఎల్లయ్య, శ్రీను, నర్సింలు, విజయ్, స్వామి వెళ్లి టిప్పర్లను అడ్డుకొని వీడియోలు తీస్తున్నారు. దీంతో మట్టి మాఫియా తాలూకు వ్యక్తులు వారిపై చేయిచేసుకొని ఫోన్లు లాక్కున్నారు.
ఈ క్రమంలో తోపులాట జరగగా వీఆర్ఏలకు గాయాలయ్యాయి. అనంతరం మట్టి రవాణాకు అడ్డొస్తే చంపేస్తామని తమను బెదిరించారని వీఆర్ఏలు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ విషయమై ఎస్సై సందీప్ రెడ్డి ని వివరణ కోరగా.. వీఆర్ఏ మన్నె నరేశ్ ఫిర్యాదు మేరకు జీడిపల్లి గ్రామానికి చెందిన టెంట్ హౌస్ శ్రీను, నరేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, రెండు టిప్పర్లు దొరకగా సీజ్ చేశామని, మరో టిప్పర్ తప్పించుకు పోయిందని డిప్యూటీ తహసీల్దార్ శ్రీకాంత్ తెలిపారు.