పాత గొడవలతో.. స్నేహితుడిపై కత్తితో దాడి

జీడిమెట్ల, వెలుగు: స్నేహితుడితో కూర్చుని మద్యం తాగిన ఓ యువకుడు.. పాత గొడవలను గుర్తుచేసుకొని మరోసారి ఘర్షణకు దిగాడు. అతడిపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. పేట్ బషీరాబాద్​పీఎస్ పరిధిలోని జీడిమెట్లకు చెందిన బాలపోగు ప్రేమ్, జాషువా అలియాస్​ బన్నీ ఇద్దరు స్నేహితులు. ఆదివారం అర్ధరాత్రి కలిసి మద్యం తాగారు. 

గతంలో ఇద్దరి మధ్య జరిగిన గొడవలు గుర్తుచేసుకుని గొడవపడ్డారు. ఈ క్రమంలో బన్నీ కోపంతో తన వెంట తెచ్చుకున్న కూరగాయలు కోసే కత్తితో ప్రేమ్​పై దాడి చేశాడు. కడుపులో, కుడి చేతిపై పొడిచి పరారయ్యాడు. గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని సమీప హాస్పిటల్​కు తరలించారు. ప్రస్తుతం ప్రేమ్​పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.  ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడి కోసం  గాలిస్తున్నారు.