బస్సుకు సైడ్ ఇవ్వమన్నందుకు దాడి

బస్సుకు సైడ్ ఇవ్వమన్నందుకు దాడి
  • ఓ ప్రయాణికుడితో పాటు డ్రైవర్‌‌‌‌, కండక్టర్‌‌‌‌పై దాడి
  • బస్సు అద్దాలను ధ్వంసం చేసిన యువకులు
  • కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లా గన్నేరువరం మండలంలో ఘటన

గన్నేరువరం, వెలుగు : బస్సు వెళ్లేందుకు సైడ్ ఇవ్వమని అడిగినందుకు కొందరు వ్యక్తులు బస్సు అద్దాలను పగులగొట్టి, ప్రయాణికుడిపై దాడి చేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో బుధవారం రాత్రి జరిగింది. ఎస్సై తాండ్ర నరేశ్‌‌‌‌ తెలిపిన వివరాల ప్రకారం... బుధవారం రాత్రి ఓ ఆర్టీసీ బస్సు కరీంనగర్ నుంచి గన్నేరువరం వెళ్తోంది. జంగపల్లిలో బోనాల జాతర నిర్వహిస్తున్న ముదిరాజ్‌‌‌‌ కులస్తులు బస్సును అడ్డుకొని డ్యాన్స్‌‌‌‌లు చేశారు. 

దీంతో బస్సుకు సైడ్‌‌‌‌ ఇవ్వాలని డ్రైవర్‌‌‌‌ మొండయ్య, కండక్టర్‌‌‌‌ ప్రవీణ్‌‌‌‌తో పాటు ప్రయాణికుడు అనిల్‌‌‌‌ కోరారు. ఆగ్రహానికి గురైన చింతల రమేశ్‌‌‌‌తో పాటు మరికొందరు యువకులు అనిల్‌‌‌‌పై దాడి చేయడంతో పాటు డ్రైవర్‌‌‌‌, కండక్టర్‌‌‌‌ను దుర్భాషలాడారు. అంతటితో ఆగకుండా బస్సు ముందు భాగంలోని అద్దాన్ని పగులగొట్టారు. దీంతో బస్సును గన్నేరువరం పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌కు తరలించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. డ్రైవర్‌‌‌‌ మొండయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.