నా కొడుకుని ఎందుకు చంపుతావని అడిగినందుకు దాడి

నా కొడుకుని ఎందుకు చంపుతావని అడిగినందుకు దాడి
  • ముగ్గురికి గాయాలు ఇద్దరి పరిస్థితి విషమం

పరిగి, వెలుగు: వాటర్ ప్లాంట్ నుంచి నీళ్లు తీసుకొని ఇంటికి వెళుతుండగా ‘ఇటువైపు వస్తే గడ్డపారతో పొడిచి చంపుతామ’ని యువకున్ని ఓ వ్యక్తి బెదిరించాడు. తమ కొడుకును ఎందుకు బెదిరించావని నిలదీసిన ఓ కుటుంబంపై మరో కుటుంబం తీవ్రదాడికి పాల్పడింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలం అంతారం లో సోమవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అంతారం గ్రామానికి చెందిన వేపూరి చంద్రమౌళి కొడుకు చరణ్ రాత్రి తొమ్మిది గంటలకు గ్రామంలోని వాటర్ ప్లాంట్ దగ్గర నీళ్లు తీసుకుని ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన కావలి రాములు ఇటువైపు వస్తే గడ్డపారతో చంపుతామని చరణ్​ను బెదిరించాడు. చరణ్ ఇంటికి వెళ్లి.. తల్లి పావని కి విషయం చెప్పాడు.

పావని, చంద్రమౌళి ఇద్దరు వెళ్లి సదరు వ్యక్తి నిలదీయగా.. కొద్దిసేపు వాగ్వాదం చేసి ఇంటికి తిరిగివచ్చారు. తమనే నిలదీస్తారా అని కోపోద్రిక్తులైన కావలి బసప్ప, కావలి రాములుకుటుంబీకులు సుమారు పదిహేను మంది కలిసి చంద్రమౌళి, చరణ్, నారాయణమ్మ, పావని, లావణ్య పై విచక్షణ రహితంగా దాడి చేశారు. గాయాలైన చంద్రమౌళి కుటుంబ సభ్యులు కుల్కచర్ల పోలీస్ స్టేషన్​కు వెళ్లి విషయం చెప్పగా ఎస్సై అన్వేశ్​ కుమార్ వారిని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. 

చంద్రమౌళి, నారాయణమ్మ కు తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్ తరలించారు. వీరిద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వీరికి గతంలో భూతగాదాలు ఉన్నాయి. ఇరు వర్గాల మధ్య గొడవతో గ్రామం భయభ్రాంతుల గురైంది. పోలీసులు సమయానికి స్పందించలేదని స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.