- వారపు సంతలో డ్యూటీ చేస్తున్న డీఆర్‌జీ జవాన్లు
- దాడి అనంతరం ఆయుధాలు, తూటాలతో పరారైన మావోయిస్ట్‌లు
- చత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా జేగురుగొండలో ఘటన
భద్రాచలం, వెలుగు : వారపు సంతలో బందోబస్తు డ్యూటీ చేస్తున్న జవాన్లపై మావోయిస్టులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటన చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా జేగురుగొండలో ఆదివారం జరిగింది. ఎస్పీ కిరణ్ చౌహాన్ తెలిపిన వివరాల ప్రకారం... జేగురుగొండలో ఆదివారం జరిగిన వారాంతపు సంతలో డీఆర్‌జీ జవాన్లు కర్తం దేవా, సోడి కన్నాలు బందోబస్తు డ్యూటీ చేస్తున్నారు.
ఈ టైంలో మావోయిస్ట్ స్మాల్ యాక్షన్ టీంకు చెందిన సభ్యులు గ్రామస్తుల వేషధారణలో సంతలోకి ప్రవేశించి కత్తులతో ఇద్దరు జవాన్లపై దాడి చేశారు. అనంతరం వారి వద్ద నుంచి ఏకే 47, ఎస్ఎల్‌ఆర్ ఆయుధాలు, తూటాలను తీసుకొని పారిపోయారు. ఊహించని ఘటనతో ఆదివాసీలు గందరగోళానికి గురయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఇద్దరు జవాన్లకు ఫస్ట్ ఎయిడ్ చేసిన అనంతరం హెలికాప్టర్‌లో రాయపూర్‌కు తరలించారు. మావోయిస్టుల కోసం సుక్మా పోలీసులు అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు.