- ఏడీజీపీకి టీడబ్ల్యూజేఎఫ్ విజ్ఞప్తి
- సిరిసిల్లలో యూసుఫ్‌పై కేసు ఎత్తివేయాలని నేతల వినతి
బషీర్‌బాగ్, వెలుగు: రాష్ట్రంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను, అక్రమ కేసులను అరికట్టాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) మహేశ్ భగవత్‌ను కోరింది. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య, ఉపాధ్యక్షుడు పులిపలుపుల ఆనందం, పిల్లి రాంచందర్, బండి విజయ్ కుమార్, రఘు, కార్యదర్శులు రాజశేఖర్, నవీన్, ఎస్ కే సలీమా, బిక్షపతి, నేషనల్ కౌన్సిల్ మెంబర్ రమాదేవి తదితరులు హైదరాబాద్‌లో ఏడీజీపీని కలిసి వినతి పత్రం సమర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తమ యూనియన్ నేషనల్ కౌన్సిల్ మెంబర్, జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీ సభ్యుడైన జర్నలిస్టు మహ్మద్ యూసుఫ్‌పై చందుర్తి పోలీసులు అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారని ఆరోపించారు.
సంబంధం లేని ఒక కేసులో ఆయనను ఇరికించారని తెలిపారు. దీనిపై విచారించి అక్రమ కేసు బనాయించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టు యూసుఫ్ పై పెట్టిన కేసును ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులలో రెండ్రోజుల కింది జర్నలిస్టు సుదర్శన్ పై దుండగులు దాడి చేసి విచక్షణా రహితంగా కొట్టారని, సుదర్శన్ పై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని కోరారు.
రాష్ట్రంలో చాలా చోట్ల జర్నలిస్టులపై దాడులు పెరిగిపోతున్నాయని, కొందరు పోలీసు అధికారులు కక్షపూరితంగా అక్రమ కేసులు పెడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని వారు ఏడీజీపీని కోరారు.