- డ్రగ్స్, సైబర్ నేరాలను నియంత్రించాలి
- పోలీసులకు డీజీపీ జితేందర్ ఆదేశం.. 6 నెలల నేరాలపై ఉన్నతాధికారులతో రివ్యూ
హైదరాబాద్, వెలుగు : మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాలతో పాటు డ్రగ్స్, సైబర్ నేరాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డీజీపీ జితేందర్ ఆదేశించారు. ప్రజల భద్రతకు చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. ప్రజలతో సత్సంబంధాలను కొనసాగించాలన్నారు. ఆరు నెలల క్రైం రివ్యూలో మంగళవారం పోలీసులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సెల్ ఫోన్ దొంగతనాలు, మానవ అక్రమ రవాణా, బైక్ చోరీలు తదితర నేరాలపై డీజీపీ సమీక్ష జరిపారు.
డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమీక్ష సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీసు కమిషనర్లు, జోన్ల ఐజీలు, రేంజ్ డీఐజీలు హాజరయ్యారు. డీజీపీ మాట్లాడుతూ.. రౌడీలు, అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు తగ్గాయని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను తగ్గించేందుకు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా.. 27 హత్యలు, 6 అత్యాచారాల కేసుల్లో నేరస్తులకు జీవితఖైదు పడేలా దర్యాప్తు చేసిన 36 మంది పోలీసు అధికారులను, 30 మంది ప్రాసిక్యూటర్లకు డీజీపీ ప్రశంసాపత్రాలు అందజేశారు.
డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణకు యాక్షన్ ప్లాన్
సైబర్ నేరాలపై సీఐడీ చీఫ్ శిఖా గోయల్ ప్రజంటేషన్ ఇచ్చారు. నేరాలు జరుగుతున్న తీరు, ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి తీసుకోవాల్సిన నివారణ చర్యలపై ఆమె వివరించారు. సైబర్ నేరాల నివారణకు యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య మాట్లాడుతూ రాష్ట్రం డ్రగ్స్, సైబర్ నేరాలకు కేంద్రంగా మారకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్ బి.శివధర్ రెడ్డి మాట్లాడుతూ నక్సలైట్ల సంబంధిత నేరాలు, శాంతిభద్రతలను ప్రభావితం చేసే సమస్యలపై అప్రమత్తంగా ఉండాలన్నారు.